బీఆర్ఎస్ పింక్ బుక్.. అంతకంత చెల్లిస్తారు కవిత హెచ్చరిక
తాజాగా బీఆర్ఎస్ మహిళా నేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పింక్ బుక్ రాస్తామని వెల్లడించారు.
ఏపీ రాజకీయాలను మార్చేసిన యువనేత నారా లోకేశ్ రెడ్ బుక్.. తెలుగు రాజకీయాలకు రూల్ బుక్కుగా మారుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నారా లోకేశ్ రెడ్ బుక్కు రాస్తున్నట్లు చెప్పడమే కాకుండా.. తన పాదయాత్రలో ఆ పుస్తకాన్ని ప్రదర్శించి కార్యకర్తల్లో జోష్ తెచ్చారు. దీంతో కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. 10 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో టీడీపీని విజయతీరాలకు చేర్చారు. ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ పై తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రెడ్ బుక్ నుంచి స్ఫూర్తి పొందిన మరికొందరు నేతలు కూడా రకరకాల పుస్తకాలు రాస్తున్నామని, రాస్తామంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ మహిళా నేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పింక్ బుక్ రాస్తామని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపుల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలను రక్షించుకునేందుకు తాము పింక్ బుక్ రాస్తామని ఎమ్మెల్సీ కవిత తాజాగా ప్రకటించారు. తన అనుచరుడు మనోజ్ రెడ్డిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని, అదేవిధంగా చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫేస్ బుక్, ఇన్ స్టా, యూట్యూబ్ మీడియా అంటే భయం పట్టుకుందని, తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఏ పోస్టు పెట్టినా తెల్లారేసరికి అరెస్టులు చేస్తున్నారని కవిత మండిపడ్డారు. ఈ పరిస్థితిని చూసి తాము కూడా పింక్ బుక్ రాస్తామని, అంతకంతకు తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. కవిత మాటలను విన్న బీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశంలో చప్పట్లతో తమ హర్షం వ్యక్తం చేశారు.
మొత్తానికి కవిత పింక్ బుక్ అనే సరికి అంతా నారా లోకేశ్ రెడ్ బుక్ ప్రస్తావన తెస్తున్నారు. అదీ లోకేశ్ రెడ్ బుక్ లో పేరున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు జరిగిన రోజే కవిత ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వంశీ ఎమ్మెల్యేగా ఉండగా, ప్రస్తుత సీఎం చంద్రబాబుతోపాటు లోకేశ్, ఆయన తల్లి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలు ఉన్నాయి. దీంతోనే ఆయన పేరు రెడ్ బుక్ లో రాసుకున్నానని లోకేశ్ గతంలో ప్రకటించారు. కార్యకర్తలకు రక్షణగా తన రెడ్ బుక్ ఉంటుందని లోకేశ్ పదేపదే చెప్పేవారు. ఇప్పుడు కవిత కూడా కార్యకర్తల కోసమే పింక్ బుక్ రాస్తామని చెప్పడం బీఆర్ఎస్ శ్రేణులను ఆకట్టుకుంటుందని అంటున్నారు.
ఇక లోకేశ్ రెడ్ బుక్ రాసినట్లు తాము కూడా పుస్తకాలు రాస్తామని వైసీపీ, బీఆర్ఎస్ నేతలు గతంలో ప్రకటించారు. వైసీపీ అధినేత జగన్ ఒకసారి గుడ్ బుక్ రాస్తామని చెప్పగా, మరోసారి కార్యకర్తలు రెడ్ బుక్ రాసుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు గ్రీన్ బుక్ రాస్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ రాస్తామన్నారు. ఇలా నేతలు ఎవరికి వారు పుస్తకాలు రాస్తామని చెప్పినా.. తాజాగా కవిత చేసిన ప్రకటనే ఎక్కువ ఇంపాక్ట్ చూపుతుందని విశ్లేషిస్తున్నారు.