'చేతకానివాడు చెప్పే మాటలు'... విధ్వంసం పై బొత్స ఫైర్!
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం విధ్వంసం అయ్యిందని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
ఇచ్చిన సూపర్ 6 హామీలు పూర్తిగా వెంటనే అమలు చేయకపోవడానికి, తాజా ఆర్థిక పరిస్థితికి గత వైసీపీ ప్రభుత్వమే కారణమని.. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం విధ్వంసం అయ్యిందని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం చెబుతున్న సంగతి తెలిసిందే. పాలనను, పరిస్థితిని గాడిలో పెడుతున్నట్లు చెబుతున్నారు.
గతంలో తాను ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకటో రెండో సమస్యలు మాత్రమే ఉండేవని.. ఇప్పుడు మొత్తం వ్యవస్థ గాడి తప్పిందని చంద్రబాబు ఇటీవల మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శుల మీటింగ్ లోనూ చెప్పారు! ఈ నేపథ్యంలో... చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం విధ్వంసం అయ్యిందని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్రం ఎక్కడ విధ్వంసం అయ్యిందో చంద్రబాబు చెప్పాలని.. అవన్నీ చేతకానివాడు మాట్లాడే మాటలే తప్ప మరొకటి కాదని.. ఏమీ నాశనం అవ్వలేదని అన్నారు.
ఈ సందర్భంగా... కూటమి పాలనలో సమీక్షలు తప్ప క్షేత్రస్థాయిలో హామీలు అమలు కావడం లేదని.. ప్రచారం చేసుకుంటున్న స్థాయిలో పనులు చేయడం లేదని బొత్స మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని.. కరెంట్ చార్జీలు విపరీతంగా పెరిగాయని.. వేల సంఖ్యలో ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని అన్నారు.
ఈ సందర్భంగా... ఇచ్చిన వాగ్ధానలను అమలు చేయడం లేదని.. విద్యార్థుల తల్లితండ్రులు, రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. సూపర్ సిక్స్ హామీలపై మండలిలో నిలదీస్తామని బొత్స వెల్లడించారు. తమ పాలనలో హామీలు చిత్తశుద్ధితో అమలుచేశామని చెప్పిన బొత్స.. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలోనే.. ఇంకా ఎన్ని రోజులు వైసీపీ పేరు చెప్పి బతుకుతారు అని ప్రశ్నించిన బొత్స.. కూటమి పాలనలో ఏ తప్పు జరిగినా వైసీపీపై తోసేస్తున్నారని అన్నారు. మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పి.. ఇప్పుడు పెంచుతున్నారని.. కూటమి సర్కార్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని కామెంట్ చేశారు.