ఇక కఠినంగానే అంటున్న హోం మంత్రి అనిత!
ఆ మీదట ఏపీలో వరసగా జరుగుతున్న అరెస్టులు కానీ పనిచేయని పోలీసుల మీద తీసుకుంటున్న చర్యలు కానీ చూస్తే అనిత యాక్షన్ లోకి దిగిపోయారు అని అంటున్నారు.
అన్ని వేళ్ళూ తన వైపే చూపిస్తున్న నేపథ్యంలో ఏ మాత్రం తొట్రుపాటుకు గురి కాకుండా తాను చేయాల్సిందేంటో తెలుసుకుని పోలీసు మంత్రి వంగలపూడి అనిత యాక్షన్ లో దిగిపోయారు. ఆమె ఎంతో వేగం చూపిస్తూ కేవలం రోజుల వ్యవధిలోనే తన మార్క్ ఏంటో చూపించే ప్రయత్నం చేశారు.
మీడియా ముందు ఎంత ధాటీగా ఆమె మాట్లాడుతారో తెలిసిందే. అయితే ఇపుడు నాలుగైదు నెలలుగా ఏపీలో లా అండ్ ఆర్డర్ బాగా లేదని విమర్శలు వచ్చాయి. మొదట వైసీపీ నుంచే ఈ తరహా విమర్శలు వచ్చాయి. అయితే ఏకంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ దీని మీద ఘాటైన విమర్శలు చేశారు.
హోం శాఖ పనితీరుని ఆయన ప్రశ్నించారు. అనిత రివ్యూ నిర్వహించాలని కూడా సూచించారు. దాంతో ఆమె పవన్ కళ్యాణ్ మాటలను పాజిటివ్ గా తీసుకున్నారు. ఆ మీదట ఏపీలో వరసగా జరుగుతున్న అరెస్టులు కానీ పనిచేయని పోలీసుల మీద తీసుకుంటున్న చర్యలు కానీ చూస్తే అనిత యాక్షన్ లోకి దిగిపోయారు అని అంటున్నారు.
కడప జిల్లాకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రె రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం ఒక కీలకమైన పరిణామంగా చెబుతున్నారు. అయితే ఆయనకు కొద్ది గంటల్లోనే కడప పోలీసులు 41ఎ నోటీసును అందించి విడుదల చేయడం కూడా విమర్శల పాలు అయింది. దాంతో ఆ వెంటనే కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును బదిలీ చేస్తూ హోం మంత్రి హోదాలో అనిత ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా తన శాఖలో దూకుడుని చూపించారు. అంతే కాదు ఈ వ్వవహారంలో మరో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను సైతం సస్పెండ్ చేశారు.
అంతే కాదు కేవలం డెబ్బై రెండు గంటల వ్యవధిలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేయడం కూడా హోం శాఖలో దూకుడు ఎలా ఉందో చెబుతోంది. అంతే కాదు ఎక్కడో విదేశాల్లో ఉంటూ ఏపీలో కూటమి నాయకుల మీద విమర్శలు దారుణంగా చేస్తూ అసభ్యమైన భాషను ఉపయోగిస్తున్న వారి మీద చర్యలకు హోం శాఖ ఉపక్రమించడం వెనక హోం మంత్రి చాకచక్యం ఉందని అంటున్నారు.
విధులు సక్రమంగా నిర్వహించని అధికారుల మీద కఠిన చర్యలు ఉంటాయని హోం మంత్రి తన చేతల ద్వారా స్పష్టం చేశారు అని అంటున్నారు. అంతే కాదు తాను మాటల మనిషిని మాత్రమే కాదని చేతల మనిషిని అని అవసరం అయితే ఎంత కఠినంగా ఉండగలనో కూడా ఆమె తన యాక్షన్ ద్వారా రుజువు చేస్తున్నారు అని అంటున్నారు.
ఇదిలా ఉండగా ఏపీలో గత కొద్ది నెలలుగా నేరాల సంఖ్య పెరిగిపోయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. పోలీసు అధికారులు ఇంకా కొన్ని చోట్ల ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారు అన్నది ఎన్డీయే కూటమిలోని ముఖ్య నాయకుల భావనగా ఉంది. అదే పవన్ కళ్యాణ్ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు అని అంటున్నారు.
దాంతో అనిత ఎక్కడా తగ్గేది లేదని సందేశాన్ని పోలీసు అధికారులకు మొత్తం శాఖకు పంపించడం ద్వారా తాను టఫ్ గా ఉంటాను అని చెప్పేశారు అని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలు అన్నీ కలసి ఇపుడు వైసీపీకి టఫ్ సిట్యువేషన్ ని కలిగిస్తున్నాయని అంటున్నారు. ఎందుకంటే మొత్తం అరెస్టులు అన్నీ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీదనే జరుగుతున్నాయి. దాంతో కూటమిలో కల్లోలం రేగిందని భావిస్తున్న వైసీపీ ఇపుడు తాను కార్నర్ అవుతున్నాను అని లేట్ గా గ్రహించింది అని అంటున్నారు.