ఏపీ అంటే చిన్న చూపేలా మోడీ సార్ ?

అసలు ఏపీ అంటే ఎందుకు ఇంతలా వివక్ష అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏపీకి 2014 నుంచి కేంద్రం అన్యాయమే చేస్తోంది అని అంటున్నారు.

Update: 2024-10-02 07:50 GMT

ఏపీ ఏమి చేసింది మీకు మోడీ సార్ అని ఆంధ్రులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో మూడవసారి మోడీ ప్రధానిగా అధికారం అందుకున్నారు అంటే దానికి ప్రధాన కారణం ఏపీ నుంచి నెగ్గిన 21 మంది ఎంపీలే. టీడీపీకి 16 మంది, జనసేనకు ఇద్దరు, బీజేపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వీరంతా కలసి కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు.

ఒక విధంగా చెప్పాలీ అంటే ప్రాణ వాయువుని అందించారు. మరి వీరందరినీ గెలిపించింది ఆంధ్రులు. అలాంటి ఆంధ్రులు ఇటీవల కురుసిన భారీ వర్షాల్తో వచ్చిపడిన దారుణమైన వరదలలో చిక్కుకుని పోయి విలవిలలాడితే కేంద్రం ఎంతో సాయం చేస్తుందని అంతా ఆశించారు.

ఎందుకంటే కేంద్రంలో ఏపీ కూటమి ప్రభుత్వం భాగస్వామి. మంత్రులు కూడా ఉన్నారు. పైగా చంద్రబాబు పవన్ ఇద్దరూ కూడా మోడీకి అత్యంత సన్నిహితులైన మిత్రులుగా ఉన్నారు. దాంతో ఏపీకి కనీసంగా అయిదు వేల కోట్ల రూపాయలు అయినా దక్కుతాయని అంచనా వేసుకున్నారు.

కానీ వరదలు ముగిసిన తరువాత నెల రోజులు అయిన నేపథ్యంలో గీసి గీసి వేయి కోట్ల రూపాయల సాయాన్ని కేంద్రం ప్రకటించింది. ఇది ఏ మూలకు సరిపోతుంది అన్న చర్చ వస్తోంది. బెజవాడ నిండా మునిగిన ఈ వరదలలో ప్రతీ మనిషికీ ప్రతీ కుటుంబానికీ కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది.

ఈ నష్టాన్ని అంచనా వేయడం కూడా చాలా కష్టంగా ఉంది. కనీసంగా చూస్తే పది నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా చెబుతునారు. అలాంటిది అందులో మూడవ వంతు అయిన అయిదు వేల కోట్ల రూపాయల సాయం అయినా చేయలేరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

అసలు ఏపీ అంటే ఎందుకు ఇంతలా వివక్ష అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏపీకి 2014 నుంచి కేంద్రం అన్యాయమే చేస్తోంది అని అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అన్నది లేకుండా చేసారని అలాగే విభజన హామీలను వరసబెట్టి పక్కన పెట్టారని కూడా అంతా విమర్శించిన నేపథ్యం ఉంది.

అయినా సరే ఏపీ ప్రజలు బీజేపీని మళ్లీ మళ్లీ నమ్ముతున్నారు. ఈసారి అయితే కేంద్రం ఏపీ మీద పూర్తిగా ఆధారపడి ఉంది కాబట్టి ఏ రకమైన సహాయం అయిన చిటికలో చేస్తారు అని కూడా అనుకున్నారు. కానీ జరిగింది వేరుగా ఉంది. ఏపీకి సాయం చేయడానికి కేంద్రానికి ఎందుకో చేతులు రావడం లేదు అని అంటున్నారు.

ఇది సవతి తల్లి ప్రేమ మాదిరిగా ఉందని అంటున్నారు. దానికి కారణాలు ఏంటి అంటే రాజకీయ పరమైనవేనా అన్న చర్చ కూడా ఉంది. ఎంత చేసినా ఏపీలో టీడీపీదే రాజ్యం కదా తమకు ప్రజలు నేరుగా పట్టం కట్టలేదు కదా అన్న ఆలోచన ఏమైనా ఉందా అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఏపీ ప్రజలు తమను సమాదరించినపుడు కమల వికాసం జరిగినపుడు మాత్రమే నిధులను ఇవ్వాలన్న షరతులు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా అంతా చర్చించుకుంటున్న పరిస్థితి. ఏది ఏమైనా బీజేపీని తమ భుజాల మీద మోస్తూ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కీలకమైన పాత్ర పోషించిన చంద్రబాబుని మోడీ పూర్తిగా నిరాశలో ఉంచేశారు. మోడీ అండ ఉంటే ఏపీని బాగు చేసుకోవచ్చు అని తలచిన చంద్రబాబుకు ఈ రకమైన సహాయం చూస్తే మరి మాటలు వస్తాయా అన్న చర్చ కూడా సాగుతోంది.

మొత్తం మీద చూస్తే ఏపీ భారీ వరదలతో చిగురుటాకులా వణికిన వేళ కేవలం బెజవాడ మాత్రమే కాదు గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రా సైతం నానా ఇబ్బందులు పడిన వేల ఈ అరకొర సాయంతో ఏపీకి ఏదో చేశామని కేంద్రం చెప్పుకోవాలని చూస్తే కనుక అది నిజంగా బాధాకరమైన విషయమే అని అంటున్నారు.

Tags:    

Similar News