జగన్ మీద ఎర్రన్నలు ఎగిరిపడుతున్నారెందుకో ?
తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అయితే జగన్ అసెంబ్లీకి రావడం లేదని మండిపడ్డారు.;
ఏపీలో రాజకీయం చిత్రంగా ఉంది. అధికార కూటమి అంతా ఒక్కటిగా ఉంది. అందులో మూడు పార్టీలు కలసి ఉన్నాయి. టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వంలో ఉన్నాయి. ఇక విపక్షంలో చూస్తే వైసీపీ అతి పెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇతర చిన్న పార్టీలు ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం మీద విపక్షాలు పోరాటం చేయాల్సిన తరుణం ఇది. ఏ ప్రభుత్వం అయినా మంచి పనులు చేస్తుంది, కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే కనుక వాటి మీద పోరాటం చేయాల్సింది విపక్షమే. మరి విపక్షంలో ఐక్యత ఉంటేనే ప్రభుత్వంలోని పెద్దలకు సెగ గట్టిగా తగులుతుంది.
వైసీపీ అధికారంలో ఉన్నపుడు కుడి ఎడమ తేడా లేకుండా బీజేపీ వామపక్షాలు సహా జనసేన టీడీపీ కాంగ్రెస్ అన్నీ కలసి ఆయన ప్రభుత్వం మీద దండెత్తాయి. ఇక వైసీపీ విపక్షంలోకి వచ్చినా కాంగ్రెస్ తో పాటు సీపీఐ కూడా ఆయన మీదనే విమర్శలు చేయడం విడ్డూరంగానే ఉంది అని అంటున్నారు.
ఈ విషయంలో సీపీఎం కాస్తా మెరుగ్గా ఉన్నా సీపీఐ మాత్రం జగన్ ని ఎక్కడా స్పేర్ చేయడం లేదు. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అయితే జగన్ అసెంబ్లీకి రావడం లేదని మండిపడ్డారు. ఆయన రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. అంతే కాదు వైసీపీ నేతలు చేసిన అవినీతి మీద విచారణ జరిపించి వారిని జైళ్ళలో పెట్టాలని కూడా కూటమి ప్రభుత్వాన్ని కోరారు.
సరే అవినీతి చేస్తే ఎవరిని అయినా చట్ట ప్రకారం శిక్షిస్తారు. అలా చేయాల్సిందే. అదే సమయంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల విషయంలో ఎందుకు సాఫ్ట్ కార్నర్ తో ఉంటుంది అన్న ప్రశ్న ఉండనే ఉంటుంది. ఎక్కడైనా ఆధారాలు దొరికితే కచ్చితంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ విషయంలో ఎవరు డిమాండ్ చేసినా చేయకున్నా చట్ట ప్రకారం జరగాల్సింది జరుగుతుంది.
సో ఆ విషయం అలా ఉంచి కూటమి ప్రభుత్వం చేసే తప్పుల మీద ఎర్రన్నలు మరింత గట్టిగా మాట్లాడాలిగా అని అంటున్నారు. వైసీపీ హయాంలో అక్రమాలు అని ఎటూ కూటమి ప్రభుత్వం అంటోంది. విపక్షంలో ఉన్న పార్టీలు కూడా ఎందుకు ఇంకా అదే మాట్లాడడం ప్రజా సమస్యలు ఎత్తుకోక అన్న చర్చ సాగుతోంది.
ఇక ఏపీలో జగన్ అసెంబ్లీకి వెళ్ళడం లేదని ఆయనను రాజీనామా చేయమని కోరుతున్న ఎర్రన్నలకు తెలంగాణాలో కేసీఆర్ కూడా ఏణ్ణర్ధంగా అసెంబ్లీకి పోవడం లేదు. ఆయనను కూడా రాజీనామా చేయమని డిమాండ్ చేస్తే బాగుంటుంది కదా అంటున్నారు. పైగా తెలంగాణాలో ప్రభుత్వం వైపు సీపీఐ ఉంది. దాంతో విపక్షంగా బీఆర్ఎస్ ని విమర్శించడంలో తప్పు కూడా లేదు అంటున్నారు.
కానీ ఏపీలో విపక్షంగా ఉంటూ సాటి విపక్షం మీద విమర్శలు చేయడం అంటే వైసీపీ మీద జగన్ మీద ఎర్రన్నలు దూరాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఇటీవల ఏపీలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థులకు వైసీపీ ఇండైరెక్ట్ గా మద్దతు ఇచ్చిందని కామ్రేడ్స్ తో వైసీపీ దోస్తీ అని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అదే సమయంలో ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. సిద్ధాంతపరంగా ఎన్డీయే కూటమికి యాంటీగా వామపక్షాలు ఉండాలని అంటున్నారు. ఏపీలో ఇండియా కూటమిని పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ వామపక్షాలు కృషి చేసి అందులోకి వైసీపీని కూడా చేర్చే కార్యక్రమం చేయకుండా జగన్ నే ఇంకా ఆడిపోసుకోవడం అంటే ఎన్డీయేకు మరింత ఊతమిస్తున్నట్లు కాదా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి దేశంలోని రాజకీయం వేరు. ఏపీలో పాలిటిక్స్ వేరు అని అంటున్నారు
ఏపీలో ఎన్డీయే ఇండియా కూటములు సిద్ధాంతాలు కంటే జగన్ యాంటీ పాలిటిక్స్ నే అన్ని పార్టీలు అవలంబిస్తున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక వైసీపీ తీరు కూడా దీనిని ఆద్యం పోస్తోంది. సింహం సింగిల్ అని ఒంటెద్దు పోకడలతో ఆ పార్టీ ఉండడం వల్ల కూడా ఏపీలో ఎండీయే వ్యతిరేక శిబిరం బలంగా ఏర్పాటు కావడం లేదు అని అంటున్నారు.