నామినేటెడ్ పదవుల కోసం ఆశగా !
నామినేటెడ్ పదవుల కోసం కళ్ళు కాయలు కాచేలా కూటమిలోని మూడు పార్టీలూ ఎదురుచూస్తున్నాయి.
ఏపీలో నామినేటెడ్ పదవుల పంపిణీకి తెర లేచే లాగే సీన్ కనిపిస్తోంది. నామినేటెడ్ పదవుల కోసం కళ్ళు కాయలు కాచేలా కూటమిలోని మూడు పార్టీలూ ఎదురుచూస్తున్నాయి. టీడీపీది అయితే మరీ ఆత్రంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 2019 దాకా టీడీపీ అధికారంలో ఉన్నా పూర్తి స్థాయిలో ఆనాడు నామినేటెడ్ పందేరం జరగలేదు.
మళ్ళీ మనమే వస్తామని ధీమాతో కొంత అలక్ష్యం చేసారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ వచ్చాక ఏ ఒక్క నామినేటెడ్ పదవినీ వదలేఅదు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే పదవులను పంపిణీ చేయడం మొదలెట్టింది. నామినేటెడ్ పదవులకు సాధారణంగా రెండేళ్ల కాల పరిమితి ఉంటుంది. అలా వైసీపీ హయాంలో ఎక్కువ మంది అయిదేళ్లలో లాభపడ్డారు.
ఇక టీడీపీ ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అయితే సోలోగా కాదు కూటమి కట్టి వచ్చింది. దాంతో కూటమిలోని మిత్రులకు కూడా కొన్ని పదవులు కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిణామంతో తమ్ముళ్ళకు కలవరం రేగుతోంది. ఎవరికి పదవులు వస్తాయి ఎవరికి రావు అన్న చర్చ అయితే తీవ్రంగానే సాగుతోంది.
దాదాపుగా టీడీపీలో 2004 నుంచి ఏ పదవీ దక్కని ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల జాబితా చాలా ఉంది. వారికి 2014లోనూ న్యాయం జరగలేదు. ఇక ఆ తరువాత కొత్తగా చేరిన వారు ఉన్నారు. అలా జూనియర్లు వర్సెస్ సీనియర్లు అన్నట్లుగా టీడీపీలో నామినేటెడ్ రేసు సాగుతోంది.
మరి అధినాయకత్వం యూత్ కి ప్రాధాన్యత అంటే గతంలో నుంచి పార్టీ జెండా మోసిన వారు అన్యాయం అయిపోతారు. అలా కాదు అనుకుంటే సీనియర్లకే చాన్స్ దక్కితే యువతం డీలా పడుతుంది. అందుకే రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ పదవుల పంపిణీ జరిపితే మాత్రం అవకాశాలు తగ్గుతాయని అని అంటున్నారు.
ఇక ఈ పదవుల పంపిణీలో క్రెడిటేరియా ఏమిటో బయటకు తెలియడం లేదు. దాంతో లోకల్ గా ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు సిఫార్సు చేసిన వారికి పదవులు ఇస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే చంద్రబాబు టేబిల్ మీద అన్ని వివరాలూ ఉన్నాయని ఆయన కష్టపడి పనిచేసే వారికి అన్యాయం చేయరని సీనియర్లు నమ్ముతున్నారు.
మరో వైపు చూస్తే టీడీపీకి 65 శాతం పదవులు జనసేనకు 25 శాతం పదవులు ఆ మిగిలిన పది శాతం పదవులూ బీజేపీకి అని ఒక నిష్పత్తిని పెట్టుకున్నారని ప్రచారం అవుతోంది. దీని లెక్కన చూస్తే ఏపీలో వంద వరకూ వివిధ రకాలైన సంస్థలు, కార్పోరేషన్లలో కీలక పదవులు ఉంటే అందులో 65 పదవులు తమ్ముళ్లకు అని అంటున్నారు. ఏపీలో 26 జిల్లాకు ఉన్నాయి. అంటే జిల్లాకు రెండు వంతున చైర్మన్ గిరీలు తమ్ముళ్ళకు దక్కే చాన్స్ ఉంది అని అంటున్నారు. కొన్ని పెద్ద జిల్లాలు కీలక జిల్లాలలో మూడు దాకా చైర్మన్ పదవులు రావచ్చు అని అంటున్నారు.
జనసేన విషయానికి వస్తే జిల్లాకు ఒక కీలక పదవి దక్కుతుందని అంటున్నారు. అయితే నియోజకవర్గాల వారీగా చూస్తే కొన్ని జిల్లాలలో అత్యధికంగా జనసేన బలంగా ఉంది. అలాటప్పుడు జిల్లాకు ఒకటి అంటే ఆ పార్టీ నేతలు ఇబ్బంది పడతారు అని అంటున్నారు. ఎక్కువ పదవులు తమకు కావాలని జనసేనలో డిమాండ్ ఉంది. బీజేపీ విషయం తీసుకుంటే ఇచ్చినవి పుచ్చుకోవడమే అన్న మాట వినిపిస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.