ఏపీలో చిత్రమైన కూటమి రాజకీయ కధ !
ఏపీలో ఎన్డీయే కూటమి అని పేరుకు చెప్పుకుంటున్నారు. వ్యవహారంలో చూస్తే అది టీడీపీ కూటమిగానే అంతా పిలుస్తున్నారు
ఏపీలో ఎన్డీయే కూటమి అని పేరుకు చెప్పుకుంటున్నారు. వ్యవహారంలో చూస్తే అది టీడీపీ కూటమిగానే అంతా పిలుస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఎక్కడైనా ఎన్డీయే కూటమి ఉంటే ఉండొచ్చు కానీ ఏపీకి వచ్చేసరికి పెద్దన్నగా టీడీపీనే ఉంది. ఏపీలో బీజేపీ పరిస్థితి అలా ఉంది.
ఆ పార్టీకి ఓటు షేర్ అర శాతం కంటే లేదు. కానీ అలాంటి పార్టీని తెచ్చి కూటమి కట్టారు. ఇక్కడ చూస్తే చాలా చిత్రమైన బంధం సాగుతోంది. కూటమిలో బీజేపీ ఉందా అంటే ఉందీ అన్నట్లుగానే టెక్నికల్ గా కనిపిస్తోంది. కానీ కూటమి సభలలో ఎక్కడా బీజేపీ తరఫున ఎవరూ పాలుపంచుకోవడం లేదు. ఇటీవల ఒక సభలో మాత్రమే పురంధేశ్వరి హాజరయ్యారు. ఆ తరువాత ఆమె కూడా రావడం లేదు.
కూటమి అంటే చంద్రబాబు పవన్ మాత్రమే కనిపిస్తున్నారు. ఆ మాత్రం దానికి దానిని కూటమి అని పిలవవచ్చా అంటే కానే కాదు, కానీ సీట్ల పంపిణీ మూడు పార్టీల మధ్యన సాగింది కాబట్టి కూటమి అయింది. పోనీ ఆ సీట్లు కూడా మొదటి నుంచి బీజేపీలో పనిచేసిన వారికి ఇచ్చారా అంటే అదీ లేదు. పైగా బలమైన కాపు సామాజిక వర్గాన్ని విస్మరించారు అని విమర్శలు వస్తున్నాయి.
టీడీపీ నుంచి వచ్చిన మాజీలకు పెద్ద పీట వేశారు అని అంటున్నారు. ఇలా కూటమిలో బీజేపీ పాత్ర అభ్యర్ధుల ఎంపికా అన్నీ కూడా చంద్రబాబు కోరుకున్నట్లుగానే సాగుతున్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే కూటమి తరఫున జాతీయ నేతలు బీజేపీ నుంచి ప్రచారం చేయడానికి వస్తున్నారా అంటే ఇప్పటిదాకా ఆ సంగతి తేలడం లేదు. అంతే కాదు ఎవరు వస్తారో కూడా చెప్పడం లేదు. వచ్చిన వారిలో ఎవరు ఉంటారో అన్నది తెలియడం లేదు.
ఆ చర్చ అలా ఉంటే ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ఉండదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ జాతీయ స్థాయిలో సోలోగా ఒక మ్యానిఫెస్టోని రిలీజ్ చేసింది. అదే ఏపీకి వర్తిస్తుంది అని అంటున్నారు. అందులో ఉచితాలు లేవు, మరి టీడీపీ ఇస్తున్న ఉచితాల సంగతేంటి అంటే దానితో తమకు సంబంధం లేదు అని చెప్పుకోవడానికేనా ఇలా చేస్తున్నారు అన్న డౌట్లు వస్తున్నాయి.
అంతే కాదు ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక అంటే పోలవరం ప్రత్యేక హోదా రాజధాని నిధులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు వంటివి పెట్టమంటారు. దాంతోనే బీజేపీ వ్యూహాత్మకంగా పక్కకు జరుగుతోంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే కూటమి సభలకు బీజేపీ రాకపోవడం మంచిదని టీడీపీ భావిస్తోందా అంటే అలాగే ఉంది అని అంటున్నారు.
బీజేపీ వస్తే పడే మైనారిటీ ఓట్లు పడవని, పైగా ఏపీ జనాలకు బీజేపీ ఏమీ చేయలేదని ఆ వ్యతిరేకత కాస్తా పుట్టె ముంచుతుందని అంటున్నారు. దాంతో వారు వస్తే ఓకే లేకపోయినా ఓకే అన్నట్లుగా టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. ఇది బీజేపీకి బాగున్నట్లుగానే ఉంది. జగన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసి రేపటి ఎన్నికల తరువాత ఆన మద్దతు కోసం ఇబ్బంది పడుతూ అడగడం కంటే అలా అంటీముట్టనట్టుగా ఉంటేనే మేలు అన్నట్లుగా ఉంది అంటున్నారు. మొత్తానికి ఏపీలో చూస్తే చాలా చిత్రమైన కూటమి రాజకీయ కధ సాగుతోంది అని అంటున్నారు.