మనసు వికలం చేసే రిపోర్టు.. మణిపూర్ మహిళల పోస్టుమార్టం రిపోర్టు
దారుణ హత్యకు గురైన మూడేళ్ల బాలుడితో సహా మహిళల డెడ్ బాడీస్ మీద కాల్పుల ఆనవాళ్లతో పాటు అనేకచోట్ల గాయాలు ఉన్నట్లుగా వెల్లడైంది.
రావణకాష్ఠంలా మారిన మణిపుర్ లో కొద్ది రోజుల కిందట చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు.. మళ్లీ ఆ రాష్ట్రంలో అశాంతిని నిద్ర లేచేలా చేశాయి. ఇటీవల కనిపించకుండా పోయిన ఆరుగురు మహిళలు.. చిన్నారులు, ఆ తర్వాత దారుణ హింసకు గురై ప్రాణాలు పోగొట్టుకున్న వైనం బయటకు రావటం.. పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ ఆరు డెడ్ బాడీస్ కు చేసిన పోస్టుమార్టం రిపోర్టు తాజాగా బయటకు వచ్చింది. వీరిని అత్యంత పాశవికంగా హత్య చేసినట్లుగా రిపోర్టు వెల్లడించింది.
మైతేయ్ వర్గానికి చెందిన ఆరుగురు ఈ నెల పదకొండున కిడ్నాప్ కు గురి కావటం.. ఆ తర్వాత నిర్జీవ స్థితిలో వారు దొరకటం తెలిసిందే. ఇందులో ముగ్గురు చిన్నారులు.. ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరి డెడ్ బాడీస్ నదిలో కొట్టుకు వచ్చాయి. అనంతరం ఈ మ్రతదేహాలకు అసోంలోని సిల్చర్ వైద్య కాలేజీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం.. వీరి డెడ్ బాడీస్ ను తీసుకెళ్లేందుకు బాధిత కుటుంబాల వారు నిరాకరించారు. ఈ దారుణాలకు కారణమైన వారిని శిక్షించే వరకు.. తమకు న్యాయం జరిగే వరకు తాము తీసుకెళ్లమని తేల్చారు.
దారుణ హత్యకు గురైన మూడేళ్ల బాలుడితో సహా మహిళల డెడ్ బాడీస్ మీద కాల్పుల ఆనవాళ్లతో పాటు అనేకచోట్ల గాయాలు ఉన్నట్లుగా వెల్లడైంది. ఈ రిపోర్టులోని అంశాల్ని చూసినప్పుడు మనసు వికలం కావటమే కాదు.. ఇంత దారుణంగా హింసించటమా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. చిన్నారి బాలుడి కన్ను కనిపించకపోవటమే కాదు.. అతడి పుర్రెలో బుల్లెట్ గాయాలు ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాదు.. ఛాతీపై గాయాలు.. కత్తిపోట్లు.. నుదిటిపైనా గాయాలు ఉన్నట్లుగా తేలింది.
బాలుడి డెడ్ బాడీ కుళ్లిన స్థితిలో దొరికింది. ఎలా మరణించారన్న విషయాల్ని వెల్లడించలేదు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తారని చెబుతున్నారు. పోస్టు మార్టం రిపోర్టు ప్రకారం బాలుడి తల్లి శరీరంపై మూడు బుల్లెట్ గాయాలు ఉన్నాయని.. చిన్నారి నానామ్మ ఒంటిపై ఐదు బుల్లెట్ గాయాలు ఉన్నట్లుగా గుర్దించారు. ఈ ఇద్దరు మహిళల ఒంటిపై పలు చోట్ల గాయాలు ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు. మరో మహిళ.. ఇద్దరు చిన్నారుల పోస్టుమార్టం రిపోర్టులు బయటకు రాలేదు. మరింత క్రూరంగా హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. గత ఏడాది మే నుంచి ఇప్పటివరకు మణిపుర్ హింసకు 258 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. తాజా హింస నేపథ్యంలో మరిన్ని భద్రతా దళాల్ని మణిపుర్ వ్యాప్తంగా మొహరించనున్నారు. ఇప్పటివరకు 198 కంపెనీల బలగాలు రాష్ట్రంలో ఉండగా.. మరో 90 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు రాష్ట్రానికి రానున్నట్లుగా చెబుతున్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్లపై జరిగిన దాడులకు సంబంధించి ఇప్పటివరకు 32 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 3 వేల ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. మొత్తంగా చూస్తే.. తాజా హింసాత్మక పరిణామాల నేపథ్యంలో మణిపుర్ లో హింసకు చెక్ చెప్పాలంటే మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటున్నారు.