టార్గెట్ పెద్దిరెడ్డి, పుంగనూరులో జనసేన జజ్జనకరి జనారే..

ఫిబ్రవరి 3న జరిగే ఈ సభలోనే పెద్దిరెడ్డిపై పోరుకు శంఖారావం పూరించనున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు.

Update: 2025-02-02 10:30 GMT

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై జనసేన ఫోకస్ చేస్తోంది. పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 3న జరిగే ఈ సభలోనే పెద్దిరెడ్డిపై పోరుకు శంఖారావం పూరించనున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు.

వైసీపీలో ముఖ్యనేతల టార్గెట్ గా కూటమి పార్టీలు పావులు కదపుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన తమ రాజకీయ వ్యూహంతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తున్నాయి. ఇప్పటికే అవినీతి కేసుల ద్వారా ఆ పార్టీ నేతలపై ఒత్తిడి పెంచగా, మరోవైపు రాజకీయంగా వైసీపీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. కడపలో మహానాడు నిర్వహించేందుకు టీడీపీ నిర్ణయించిన మరునాడు.. అదేప్రాంతంలోని పుంగనూరులో జనసేన సభ నిర్వహించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

రాయలసీమలో వైసీపీకి గతంలో గట్టి పట్టు ఉండేది. టీడీపీని స్థాపించిన నలభై ఏళ్లు అవుతున్నా, రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు మూడు జిల్లాల్లో టీడీపీయేతర పార్టీలకే బలం ఎక్కువగా ఉండేది. ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లా మినహాయిస్తే కడప, కర్నూలు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో టీడీపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు ఎప్పుడూ రాలేదు. కానీ, గత ఎన్నికల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత వల్ల రాయలసీమలో కూటమి సునామీ రేపింది. ఉమ్మడి అనంతపురం జిల్లాను క్లీన్ స్వీప్ చేయగా, కడప ఏడు సీట్లు, చిత్తూరు, కర్నూలుల్లో 12 సీట్లు చొప్పున గెలుచుకుంది. ఇన్నిసీట్లు ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ రాలేదు. దీంతో ప్రస్తుత బలాన్ని సుస్థిరం చేసుకోవాలని టీడీపీ ప్రణాళిక రచిస్తోంది. ఇదే సమయంలో అధికార బలంతో రాయలసీమలోనూ జనసేన విస్తరణకు ప్లాన్ రెడీ అయింది.

వైసీపీ ముఖ్యనేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాపై టీడీపీ ఫోకస్ చేయగా, ఆ పార్టీకి చెందిన మరో ముఖ్యనేత పెద్దిరెడ్డిపై జనసేన యుద్ధం ప్రకటించినట్లు చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా, రాయలసీమలో పెద్దిరెడ్డి హవా నడిచింది. ముఖ్యంగా ఆయన సొంత నియోజకవర్గంలో వైసీపీ తప్ప మరో జెండా ఎగరడం అంత తేలిక కాదని చెబుతున్నారు. అలాంటి చోట జనసేన భారీ బహిరంగ సభ నిర్వహణకు సిద్ధమవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. పెద్దిరెడ్డి ఇలాకాలో జనసేన సభను సక్సెస్ చేయడానికి రాయలసీమలోని క్యాడర్ మొత్తం కష్టపడుతోంది. దీంతో రేపు జరిగే సమావేశానికి జనం నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందనేది ఆసక్తిరేపుతోంది.

Tags:    

Similar News