తెలుగమ్మాయి త్రి‘షాన్ దార్’.. భారత్ దే అండర్ 19 టి20 ప్రపంచ కప్

Women Team India Won ICC Womens Under-19 T20 World Cup 2025

Update: 2025-02-02 11:23 GMT

భారత పురుషుల సీనియర్ జట్టు దక్షిణాఫ్రికాపై టి20 ప్రపంచ కప్ గెలిచిన బాటలోనే అండర్ 19 అమ్మాయిలు కూడా సంచలనం రేపారు. రెండో ప్రపంచ కప్ ను గెలుచుకున్నారు. అయితే ,ఇందులో అసలు విశేషం తెలుగమ్మాయి కావడం గమనార్హం. ఇప్పటికే టి20 ప్రపంచ కప్ లో సెంచరీ చేసిన తొలి అమ్మాయిగా రికార్డుల్లోకి ఎక్కిన భద్రాచలం యువతి గొంగడి త్రిష.. ప్రపంచ కప్ ఫైనల్లోనూ తన సత్తా చాటింది.

మలేసియాలో జరిగిన రెండో టి20 ప్రపంచ కప్ లో భారత్ జయకేతనం ఎగురవేసింది. వరుసగా రెండోసారి టైటిల్ కొట్టింది. ఇప్పటివరకు రెండు టి20 ప్రపంచ కప్ లు జరగ్గా రెండూ మన అమ్మాయిలే గెలవడం విశేషం.

ఆదివారం కౌలాలంపూర్ లో జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 83 పరుగులు మాత్రమే చేసింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష 15 పరుగులకే మూడు వికెట్లు తీసింది. 84 పరుగుల లక్ష్యాన్ని టీమ్ ఇండియా ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇందులో సగంపైగా పరుగులను ఓపెనర్ త్రిష (44నాటౌట్)నే చేసింది. ప్రపంచ కప్ ఫైనల్ వంటి ఒత్తిడి మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రతిభ చాటిన త్రిష భారత్ ను వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిపింది. త్రిష ఈ టోర్నీ ఆసాంతం బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సత్తా చాటిన సంగతి తెలిసిందే.

ప్రపంచ కప్ లో సెంచరీతో పాటు వికెట్లు కూడా తీసిన త్రిషనే ప్లేయర్ ఆఫ్‌ ది మ్యచ్‌ తో పాటు, ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ అవార్డు వరించింది. కాగా, తెలుగు రాష్ట్రాల నుంచి భారత జట్టుకు కెప్టెన్ స్థాయికి ఎదిగిన మిథాలి రాజ్ ను ఆదర్శంగా తీసుకున్న త్రిష ఆమెలానే అదరగొడుతోంది. ‘నాకు సహకరించిన టీమ్ సభ్యులందరికీ ధన్యావాదాలు. ప్రతి అండర్ 19 వరల్డ్ కప్ భారత్‌ తోనే ఉండాలన్నది నా కోరిక. యువ క్రికెటర్లకు అదే చెప్తాను. ప్లేయర్ ఆఫ్‌ ది టోర్నమెంట్ అవార్డును నా తండ్రికి అంకితం చేస్తున్నాను’ అని త్రిష తెలిపింది.

ప్రపంచ కప్ లో త్రిష 309 పరుగులు చేసింది. అత్యధిక పరుగుల రికార్డు ఈమెదే. 7 వికెట్లు కూడా తీసింది. ఇటీవలి ఆసియా కప్‌ లోనూ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌ త్రిషకే దక్కింది. భారత్‌ బౌలర్ వైష్ణవి శర్మ ఈ టోర్నీలో 17 వికెట్లు తీసింది.

Tags:    

Similar News