విశాఖ బీజేపీకి...అనకాపల్లి జనసేనకు...ఇది కన్ ఫర్మ్...?

ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ మూడు సీట్లను పొత్తులో భాగంగా మూడు ప్రధాన పార్టీలు పంచుకుంటాయని అంటున్నారు

Update: 2023-09-26 04:03 GMT

ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ మూడు సీట్లను పొత్తులో భాగంగా మూడు ప్రధాన పార్టీలు పంచుకుంటాయని అంటున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, అరకు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈ మూడింటినీ 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది. ఇక కాస్తా వెనక్కు వెళ్తే 2014లో అరకు ఎంపీ సీటు వైసీపీ గెలుచుకుంటే విశాఖలో బీజేపీ, అనకాపల్లిలో టీడీపీ గెలిచింది. అలా అప్పట్లో మూడు పార్టీలు మూడు సీట్లను గెలిచి పంచుకున్నాయి.

ఇక విపక్షాల పొత్తుల కధలో ట్విస్ట్ ఏంటి అంటే మూడు పార్టీలు గెలవడానికి సీట్లు పంచుకుంటాయన్న మాట. అలా చూస్తే విశాఖ ఎంపీ సీటు బీజేపీకి రిజర్వ్ చేసారు అని తెలుస్తోంది. ఈ సీటు నుంచి పోటీ చేసేది బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అని అంటున్నారు. ఆయన మూడేళ్ళుగా విశాఖలో మకాం వేశారు. సొంత ఇల్లు కొనుక్కుని మరీ విశాఖ వాసి అయిపోయారు.

విశాఖలో బీజేపీ తరఫున ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. సో ఆయన విశాఖలో స్థిరపడిపోయిన వారిగానే చూడాలని అంటున్నారు. ఆయననే ఎందుకు బీజేపీ అభ్యర్ధిగా నిలబెడుతుంది అంటే ఆయన బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో పదమూడు నుంచి పద్నాలుగు లక్షల ఓట్లు ఉంటే అందులో రెండు లక్షల ఓట్లు కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవి.

దాంతో ఈసారి జీవీఎల్ ని నిలబెట్టి ఆ వర్గం ఓట్లు కొల్లగొట్టాలని బీజేపీ చూస్తోంది. దీంతో పొత్తులు ఉంటే జనసేన టీడీపీ బేస్ తో మద్దతు కలిపి బీజేపీ మరోసారి అంటే 2014 తరువాత 2024 లో రెండవసారి విశాఖ ఎంపీ సీటు గెలుచుకుంటుంది అని లెక్క వేస్తున్నారు. దాంతో బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరికి విశాఖ సీటు ఇవ్వరని కూడా అంటున్నారు. ఆమెకు కోస్తా జిల్లాలో మరో బలమైన సామాజికవర్గం ఉన్న చోట ఎంపీ సీటు ఇస్తారని తెలుస్తోంది.

ఇక అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ఏదైనా కారణాల వల్ల ఆయన పోటీ చేయకపోతే మాత్రం ఆ సీటులోకి జనసేన లీడర్ బొలిశెట్టి సత్యనారాయాణ పోటీ చేస్తారు అని టాక్ నడుస్తోంది. బొలిశెట్టి 2014లో కాంగ్రెస్ తరఫున విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేసి ఓడిపోయారు. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన ఆయనకు టికెట్ ఇస్తే అర్ధబలం అంగబలం కలసివస్తాయని జనసేన అంచనా కడుతోంది.

ఇక అరకు సీటులో టీడీపీ పోటీ చేస్తుంది అని అంటున్నారు. గత సారి కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఇపుడు వైరిచర్ల కుటుంబానికే చెందిన యువ నేత ఒకరిని బరిలోకి దించుతారు అని అంటున్నారు. లేకపోతే ఎన్నికల వేళకు ఎస్టీ సామాజికవర్గానికి చెందిన బిగ్ షాట్ ని తెచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి మూడు సీట్లకు మూడు పార్టీలు పోటీకి కన్ ఫర్మ్ చేసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

Tags:    

Similar News