పొత్తులపై ఏపీ బీజేపీ నేతల హాట్‌ కామెంట్స్‌!

బీజేపీ తమతో పొత్తుకు కలిసి వస్తే ఈ 57 సీట్లలో కొన్ని సీట్లను ఆ పార్టీకి టీడీపీ కేటాయించాల్సి ఉంటుంది

Update: 2024-03-03 06:16 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి విడతలో టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జనసేన ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మరో 19 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. మొత్తం 175 స్థానాలను గానూ మరో 57 స్థానాలకు మాత్రమే టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

బీజేపీ తమతో పొత్తుకు కలిసి వస్తే ఈ 57 సీట్లలో కొన్ని సీట్లను ఆ పార్టీకి టీడీపీ కేటాయించాల్సి ఉంటుంది. అయితే బీజేపీ ఇంతవరకు పొత్తులపై తేల్చడం లేదు. ఒంటరిగా పోటీ చేయడమే లక్ష్యం అన్నట్టుగా ఆ పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు ఫిబ్రవరిలో ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ నేతలను కలసి వచ్చినా పొత్తుల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తు పెట్టుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో లోక్‌ సభ, శాసనసభ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై బీజేపీ నాయకత్వం తాజాగా కసరత్తు ప్రారంభించింది. రాయలసీమ, ఉత్తరాంధ్రతోపాటు విజయవాడ, గుంటూరు, బాపట్ల జిల్లాల వారీగా సమావేశాలు తాజాగా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్‌ , రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పొత్తులపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేతలు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగానే తమకు ఆసక్తి ఉన్న స్థానాల గురించి పలువురు వివరించారు. జిల్లాల వారీగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి కనబరుస్తున్న వారి జాబితాలను పార్టీ నాయకత్వం ఇప్పటికే రూపొందించింది. వీటిని వడపోసి, ప్రాధాన్య క్రమంలో నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసింది.

ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలబలాలు, సామాజిక సమీకరణాలు, ఆర్థిక పరిస్థితులు, ఇతర అంశాల గురించి తాజా సమావేశంలో బీజేపీ నేతలు చర్చించారు. రానున్న ఎన్నికల్లో ఏయే లోక్‌ సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలి? అభ్యర్థులు ఎవరెవరు అన్నదానిపై ఇప్పటికే పార్టీ నాయకత్వం ప్రాథమిక స్థాయిలో కసరత్తు పూర్తి చేసింది. పొత్తు ఉంటే ఎలా, పొత్తు లేకపోతే ఎలా ఉండాలి.. అభ్యర్థుల ఎంపికపై జాబితాలు సిద్ధం చేసింది.

విజయవాడలో తాజాగా జరిగిన సమావేశంలో రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో పొత్తులు ఉండాలా... వద్దా అనే అంశంపై శివప్రకాష్‌ అభిప్రాయాలు తీసుకున్నారని పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ సీఎం రమేశ్‌ తెలిపారు.

మరోవైపు తాను జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమని చెప్పానని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. పార్టీ నిర్ణయిస్తే కడప ఎంపీ లేదా ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయడానికి తాను సిద్ధమేనని చెప్పారు. పొత్తుంటే జమ్మలమడుగు సీటు బీజేపీకి వస్తుందా లేదా అనేది కూడా పార్టీయే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. టీడీపీ–జనసేన పార్టీలు అభ్యర్థులను ప్రకటించని స్థానాలు ఇంకా చాలా ఉన్నాయని గుర్తు చేశారు. పొత్తులతో లేదా ఒంటరిగా ఎలా పోటీ చేసేందుకైనా పార్టీ సిద్ధంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరో సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ

2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేశామని గుర్తు చేశారు. 2014లో తాను విశాఖ నార్త్‌ నుంచి గెలిచానన్నారు. ఈసారీ అక్కడినుంచే పోటీ చేయాలనుకుంటున్నాని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో పొత్తు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని హాట్‌ కామెంట్స్‌ చేశారు. అయితే పొత్తుల విషయంలో అధిష్టానందే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.

తాజా సమావేశంలో రాష్ట్ర బీజేపీ నేతల నుంచి జాతీయ సహ సంఘటన్‌ కార్యదర్శి శివప్రకాశ్‌ అభిప్రాయాలు సేకరించారు. ఎక్కువ మంది నేతలు పొత్తుకు అనుకూలంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శివప్రకాశ్‌ బీజేపీ అధిష్టానానికి తన నివేదికను అందించనున్నారు. దీని ఆధారంగా బీజేపీ జాతీయ నాయకత్వం పొత్తులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News