అమరావతి రాజధాని పూర్తి అయ్యేది అప్పటికేనా ?
టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా అమరావతి మీద తీసుకున్న నిర్ణయంతో అందరికీ కొత్త డౌట్లు వస్తున్నాయి.
టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా అమరావతి మీద తీసుకున్న నిర్ణయంతో అందరికీ కొత్త డౌట్లు వస్తున్నాయి. అమరావతి అన్నది టీడీపీ కూటమికి అతి పెద్ద ప్రయారిటీ అన్నది తెలిసిందే. టీడీపీ 2014లో అధికారంలో వచ్చినప్పటి నుంచి అమరావతి మీదనే ఫోకస్ పెట్టింది. అయితే అపుడు కొంత వర్క్ స్టార్ట్ అయ్యాక దిగిపోయింది.
వైసీపీ అయితే అయిదేళ్ల పాటు పట్టించుకోలేదు. ఇపుడు అమరావతి పరిస్థితి ఎక్కడ ఉంది అన్నది రెండు నెలల కూటమి ప్రభుత్వానికే అర్ధం కావడం లేదు. తాము 2019లో అధికారం నుంచి దిగి పోయినప్పుడు నిర్మాణంలో ఉన్న అసెంబ్లీ ఉద్యోగుల భవనాలు వంటివి అయిదేళ్ళుగా పాడుబట్టి ఉన్నాయి. వాటి నిర్మాణ సామర్ధ్యం ఎలా ఉందో ఇపుడు వాటిని మళ్లీ దారికి తేవచ్చునో లేదో అన్న దాని మీద మద్రాస్ ఐఐటీకి చెందిన నిపుణులను రప్పించి ప్రభుత్వం నివేదిక కోరింది.
ఆ నివేదిక బట్టి ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఒక వేళ ఆ నిర్మాణాలు పనికిరావని తేల్చినా లేదా మరింత పటిష్టంగా మొదటి నుంచి చేపట్టాలని సూచించినా కూడా ఇంతకు ఇంత ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. మరో వైపు చూస్తే తొలి రోజులలోనే అమరావతి రాజధాని మీద ఒక అంచనాను అయితే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇచ్చేశారు.
అమరావతి రాజధాని తొలి దశ నిర్మాణం పనులు పూర్తి అయ్యేందుకు 48 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ఆయన తేల్చేశారు. ఇక కేంద్రం మీద భారం వేసి అమరావతికి దండిగా నిధులు తెచ్చుకోవాలని అనుకున్నా తాజా బడ్జెట్ లో కేంద్రం అమరావతికి ఇచ్చింది గ్రాంట్ కాదని రుణం అని తేలిపోయింది. ఈ నేపధ్యంలో ఆ పదహారు వేల కోట్ల రూపాయలు నిధులు మొత్తం వెచ్చించినా తొలిదశలో మూడవ వంతు అయినా పూర్తి అవుతుందా అది కూడా ఏ కాల పరిమితిలో పూర్తి అవుతుంది అన్నది కూడా ఒక చర్చగానే ఉంది.
తాజాగా అమరావతి మీద మంత్రి నారాయణ మాట్లాడుతూ రైతులకు మరో అయిదేళ్ల పాటు కౌలు చెల్లించేందుకు గడువుని పెంచామని చెప్పారు అంటే ఇప్పటికి పదేళ్ళుగా కౌలు రైతులకు అందుతోంది. అలాగే రైతు కూలీలకు పెన్షన్ ఇస్తున్నారు. ఇపుడు మరో అయిదేళ్ల పాటు దానిని పెంచడం అంటే రైతులకు వారి ప్లాట్లు వారికి ఇచ్చేందుకు అయిదేళ్ల కాలం పడుతుందని భావించి అలా గడువు పెంచారా అన్న చర్చ వస్తోంది.
రైతులు ఇచ్చిన భూములకు గానూ వారికి ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్, అలాగే ఒక కమర్షియల్ ఫ్లాట్ ఇవ్వడమే రాజధాని కోసం రైతుల నుంచి చేసుకున్న ఒప్పందం. అలా రాజధాని తయారయ్యేంతవరకూ రైతులు నష్టపోకుండా అప్పటివరకూ వారికి కౌలు ఇవ్వడానికి కూడా ఈ ఒప్పందంలో ఉంది. దాని ప్రకారం ముందో వెనకో జగన్ సర్కార్ కూడా కౌలుని రైతులకు ఇస్తూ అయిదేళ్ళ పాటు ఆర్ధికంగా నిధులను తెచ్చి ఖర్చు చేసింది.
ఇపుడు మరో అయిదేళ్ళ పాటు కౌలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడం అంటే అప్పటిదాకా రైతులకు ఫ్లాట్లు వేసి ఇవ్వరా అన్నదే డౌట్ గా ఉంది. అలా ఫ్లాట్లు వేసి ఇవ్వకపోతే కనుక కౌలు చెల్లిస్తూనే పోవాలి. రాజధాని నిర్మాణం ఒక కొలిక్కి వచ్చి లే అవుట్లు అన్నీ పూర్తి అయితే రైతులకు ఫ్లాట్లు ఇవ్వడం అన్నది జరుగుతుంది. మరి ఇదంతా అయ్యేందుకు టైం పడుతుందనేనా అయిదేళ్ళ పాటు కౌలు చెల్లించడం అన్నదే ప్రశ్నగా ముందుకు వస్తోంది. మొత్తానికి చూస్తే అమరావతి మళ్లీ భారీ ప్రాజెక్ట్ గానే తలకెత్తుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడుతోంది, మరి ఎప్పటికి పూర్తి అవుతుంది అంటే జవాబు ఎవరూ చెప్పలేరేమో.