జగన్ ని వీరుడుగా భావిస్తున్నారా...?

వైఎస్ జగన్ ఇప్పటికి పద్నాలుగేళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నారు. ఆయనది ఎపుడూ ఒంటరి పోరాటమే.

Update: 2023-09-10 03:57 GMT

వైఎస్ జగన్ ఇప్పటికి పద్నాలుగేళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నారు. ఆయనది ఎపుడూ ఒంటరి పోరాటమే. ఆయన వ్యూహాలు ఎపుడూ ప్రత్యర్ధులకు అందవినివే. అసాధ్యం అనుకున్నది సాధ్యం చేయడమే జగన్ నైజం. పాలిటిక్స్ లో ఎవరూ రిస్క్ ఫేస్ చేయడానికి ఇష్టపడరు. కానీ జగన్ మాత్రం రిస్క్ కోరుకుంటారు. అయన అందులోనే సక్సెస్ ని చూస్తారు.

చంద్రబాబు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయనది సుదీర్ఘ రాజకీయ అనుభవం. బాబు తన పాలనలో అంతా మంచే చేశారా అక్రమాలు లేవా అంటే వరసబెట్టి చాలానే చెబుతారు. 1996లో ఏలేరు స్కాం నుంచి మొదలెట్టి తెల్గీ స్కాం వంటివి ఎన్నో బాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు జరిగాయని ప్రచారంలో ఉన్న మాట.

విభజన ఏపీలో అమరావతి రాజధాని స్కాం అని వైసీపీ ఆరోపిస్తూనే ఉంది. పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబుకు ఏటీఎం లా మారింది అని సాక్ష్తాత్తూ దేశ ప్రధానే అన్న ఘాటైన విమర్శ కూడా ఉంది. బాబు మీద ఎంతో మంది కేసులు పెట్టారు. అయితే చాలా వరకూ స్టేల వద్దనే ఆగిపోయాయి.

చంద్రబాబు అరెస్ట్ ని ఎవరూ అడ్డుకోలేరు అన్న వారు కూడా ఓటుకు నోటుకు కేసు తరువాత ఎందుకో వెనక్కిపోయారు. బాబు జోలికి అయితే ఎవరూ రాలేదు. దాంతో తాను నిప్పుని అని బాబు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు అలాంటి బాబుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.

తొలిసారి కోర్టు మెట్లు ఎక్కిస్తోంది. ఆర్ధిక నేరాల విషయం కాబట్టి న్యాయమూర్తి ఎదుట బాబు తప్పనిసరిగా హాజరు కావాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు. అలా బాబుని అరెస్ట్ చేసి కోర్టు ముందు పెట్టడం అంటే నిజంగా జగన్ గ్రేట్ అంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. బాబు అరెస్ట్ ఈ రెండింటినీ కలిపిన బహు మొనగాడు జగన్ అని ఒక సెక్షన్ నుంచి కితాబులూ వస్తున్నాయి.

ఈ దేశంలో ఎంతో మంది జైలుకు వెళ్లారు, కేసులు పడి కోర్టుల చుట్టూ తిరిగారు. బాబు వరకే ఎందుకు అలా అని అంటున్న వారు ఉన్నారు. ఆయన ఏమైనా సుద్ద పూసా ఆయన అవినీతి చక్రవర్తి అని సాక్షాత్తూ పిల్లను ఇచ్చిన మామ ఎన్టీయార్ బిరుదు ఇచ్చారు కదా అని గుర్తు చేసిన వారూ ఉన్నారు.

మొత్తానికి ఎవరు ఏమీ చేయలేకపోయినా జగన్ మాత్రం అరెస్ట్ చేసి కోర్టు దారి చూపించారు అని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అంటున్నారు. జగన్ని వీరుడుగా జనాలు చూస్తున్నారని ఆయన అంటున్నారు. చంద్రబాబు వంటి ప్రజాదరణ లేని నాయకుడు దేశంలో ఎవరూ లేరని కూడా ఆయన దుయ్యబెట్టారు.

చంద్రబాబు జీవితం అంతా ఎన్నో మచ్చలు ఉన్నాయని అలాంటి బాబుని పట్టుకుని అరెస్ట్ చేసిన సీఐడీని కూడా అభినందించాలని భూమన అంటున్నారు. బాబు అరెస్ట్ చట్టబద్ధమని, న్యాయమైన చర్య అని భూమన సమర్ధించారు. బాబుకు వత్తాసు పలికేవారు అంతా అవినీతికి మద్దతు ఇచ్చినట్లే అని కూడా భూమన తేల్చేశారు.

బాబుని సమర్ధిస్తున్న పవన్ కళ్యాణ్ మీద భూమన మండిపడ్డారు. అవినీతి చేసి అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందా అని ఆయన నిలదీశారు అలిపిరిలో చంద్రబాబు మీద క్లైమోర్ మెన్ బాంబు దాడి జరిగితే తరువాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు సానుభూతి చూపించలేదని ఆయన అంటున్నారు. అందువల్ల బాబు అవినీతి అరెస్టుతో సింపతీ కార్డు తీసిన ఉపయోగం లేదని భూమన స్పష్టం చేశారు.

Tags:    

Similar News