బాబు, జగన్ వల్ల కాలేదు... పవన్ వల్ల అవుతుందా?

ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద కూలీలకు రోజుకి రూ.220 వరకూ అందుతోంది! ఈ పథకం కింద కరువు ఏడాదికి 100 రోజులు పనులు కల్పిస్తున్నారు.

Update: 2024-06-25 05:12 GMT

అనుకోవడం వేరు, ఆచరణలో పెట్టడం వేరు! ఒక్కోసారి ఉద్దేశ్యం మంచిదైనా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు అనుకూలించకపోతే మంచి ఆలోచన కూడా చెడు ఫలితాలను ఇస్తుంటుంది. ఆ సంగతి అలా ఉంచితే... ఏపీలో ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచి, డిప్యూటీ సీఎంగా ఎంపికైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు ఇష్టమైన శాఖలకు మంత్రిగా ఉన్నారు! ఈ సమయంలో ఆయన తొలి సమీక్షలోనే ఓ కీలక ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.

అవును... ఏపీలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్ కల్యాణ్.. తన తొలి సమీక్షలోనే ఓ కీలక ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారు. ఇందులో భాగంగా... గ్రామీణస్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి హామీ పథకాన్ని క్షేత్రస్థాయిలో ఎందుకు విస్తరించకూడదన్నది ఆయన ప్రశ్న. వాస్తవానికి ఇది చాలా మంచి ఆలోచనే! అయితే.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇది ఇప్పటికే రెండుసార్లు ఫెయిల్ అయిన ఆలోచనగా పేరు సంపాదించుకుంది.

గతంలోకూడా ఈ ఆలోచనను చంద్రబాబు, వైఎస్ జగన్ లు చేశారు.. ప్రయత్నించారు.. అయితే ఫలితాలు చూశాక దెబ్బతిన్నారు! దీనికి క్షేత్రస్థాయిలో ఓ బలమైన కారణం ఉంది. వాస్తవానికి ఈ ఉపాధి హామీ పనులు రెగ్యులర్ కూలి పనులతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. ఈ ఉపాధి హామీ పనులు రెండు గంటలు చేస్తే చాలు. కానీ పొలాల్లో చేసే పనులకు ఈ సొమ్ములూ చాలవు.. ఆ సమయమూ కుదరదు!

ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద కూలీలకు రోజుకి రూ.220 వరకూ అందుతోంది! ఈ పథకం కింద కరువు ఏడాదికి 100 రోజులు పనులు కల్పిస్తున్నారు. దీన్నే వ్యవసాయ పనులకు అనుసంధానం చేస్తే రైతులపై భారం తగ్గుతుందనేది పవన్ ఆలోచన అయ్యి ఉండొచ్చు! రైతులకు ఇచ్చే కూలిలో ఉపాధిహామీ సొమ్ము మినహాయించి.. మిగిలింది రైతు ఇవ్వొచ్చు. ఎందుకంటే... రైతు కూలూలకు ప్రస్తుతం రూ.500 నుంచి రూ.600 వరకూ గిట్టుబాటవుతోంది.

పైగా సుమారు 7 - 8 గంటలు పనిచేయాల్సి ఉంటుంది! దీంతో... ఉపాధి హామీ పనులకు వచ్చేవారిని పొలం పనులకు మళ్లించడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదని చంద్రబాబు హయాంలోనూ, జగన్ హయాంలోనూ నిరూపితమైన పరిస్థితి. పైగా ఉపాధి హామీ పనులతో, పొలం పనులను జోడిస్తే.. వీరు రైతు మాటలు వినే పరిస్థితి ఉండదు! ఇవన్నీ గతంలో ఎదురుపడిన ప్రాక్టికల్ ప్రాబ్లంస్!

అయితే పవన్ మాత్రం ఈ విషయంలో అధికారులతో సమాలోచనలు చేస్తున్నారని అంటున్నారు. 100 రోజులు మాత్రమే పని ఉండే ఉపాధి హామీ పనులను వ్యవసాయ పనులకు మళ్లించడం వల్ల మేలు జరుగుతుందని ఆలోచన చేస్తున్నారంట. మరి అటు చంద్రబాబు, ఇటు జగన్ వల్ల కానిది పవన్ వల్ల అవుతుందా.. ఆయన చేసి చూపిస్తారా అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News