జగన్‌ నివాసం.. ప్రభుత్వం మరో షాక్‌!

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్‌ జగన్‌ నివాసం చుట్టూ ఎవరినీ వెళ్లనీయకుండా రోడ్లను మూసేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-07-02 06:15 GMT

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్‌ జగన్‌ నివాసం చుట్టూ ఎవరినీ వెళ్లనీయకుండా రోడ్లను మూసేసిన సంగతి తెలిసిందే. అలాగే ప్రత్యేకంగా బారికేడ్లను పెట్టి.. పోలీసు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి ప్రజలెవరినీ రోడ్లపై ప్రయాణించనీయకుండా ఆంక్షలు పెట్టారు. దీంతో ప్రజలు తాడేపల్లి – తెనాలి రోడ్డులో ప్రయాణించడానికి దాదాపు 2 కి.మీ దూరం అదనంగా ప్రయాణించాల్సి వచ్చేది.

అలాగే బకింగ్‌ హామ్‌ కాలువ కరకట్ట రోడ్డును కూడా జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసేశారు. రోడ్డును మూసేసి.. దానిపై ల్యాండ్‌ స్కేపింగ్‌ ఏర్పాటు చేసి వివిధ రకాల పూల మొక్కలను పెంచారు. అలాగే జగన్‌ నివాసం పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని కూడా ఖాళీ చేయించారు. వారికి వేరే చోట్ల పునరావాసం కల్పించారు.

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడేపల్లిలో జగన్‌ నివాసం పక్కనుంచి వెళ్లే రోడ్డులో బారికేడ్లను, ప్రత్యేక పోలీసు చెక్‌ పోస్టులను ఎత్తేసింది. ప్రజలకు రాకపోకలను సులభతరం చేసింది. దీంతో ప్రజలు, రైతులు తమ గ్రామాలకు, పొలాలకు త్వరగా వెళ్లడానికి అవకాశం చిక్కింది.

తాజాగానూ కూటమి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. జగన నివాసం సమీపంలోని నాలుగు వరుసలో రహదారిలో రాకపోకలు మరింత సవ్యంగా సాగేలా చర్యలు చేపట్టింది. వాహనాలను నిలపకుండా వెళ్తే కట్టడి చేసే టైర్‌ కిల్లర్లు (మేకులతో కూడిన బారికేడ్లు), హైడ్రాలిక్‌ బొల్లార్డ్స్‌ ను క్రేన్ల సాయంతో అధికారులు తొలగించారు.

Read more!

ఈ టైర్‌ కిల్లర్లు, హైడ్రాలిక్‌ బొలార్డ్స్‌ విద్యుత్‌ మీద పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వాటిని తొలగించారు. అలాగే వీటితో పాటు రోడ్డుపై వేసిన రెయిన్‌ ప్రూఫ్‌ టెంట్లు, ఆంధ్ర రత్న పంపింగ్‌ స్కీం వైపున ఉన్న పోలీసు చెక్‌ పోస్టును సైతం ఎత్తివేశారు. తొలగించిన సామగ్రిని లారీలో తరలించారు. రహదారి వెంట కంటైనర్లు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి.

ప్రస్తుతం జగన్‌ కు ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు, కేవలం ఆయన ఎమ్మెల్యేనే. దీంతో తాడేపల్లిలోని జగన్‌ ఇంటివద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లను కూటమి ప్రభుత్వం ఎత్తేసింది. భద్రతలో భాగంగా ఆయన ఇంటికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన హైడ్రాలిక్‌ బొలార్డ్స్, టైర్‌ కిల్లర్స్‌ ను తీసివేశారు. జగన్‌ ఇంటికి పార్క్‌ విల్లాస్‌ ద్వారా వెళ్లే మార్గంలో ఉన్న చెక్‌ పోస్టులను సైతం అధికారులు ఎత్తేశారు.

అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ భద్రతకు ఏకంగా 986 మంది సిబ్బందిని నియమించుకున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే తాడేపల్లిలోని ఆయన నివాసంలోనూ, నివాసం చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ భారీ రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారని, ఇందుకు ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మార్పులకు ఉపక్రమించింది.

Tags:    

Similar News