చాంబర్లతో మంత్రుల రుణం తీరిపోయింది !
అధికారం ఒక అందం. అది ఒక దర్జా. రాజభోగం. అది లేని నాడు ఇబ్బందే.
అధికారం ఒక అందం. అది ఒక దర్జా. రాజభోగం. అది లేని నాడు ఇబ్బందే. మంత్రి పదవి కావాలని ఎవరైనా ఎందుకు కలకు కంటారు అంటే దాని కోసమే. అటువంటి అధికారాంతమున అయ్యవారి మోము చూడవలె అని ఒక పాత సామెత కూడా ఉంది. ఏపీలో చూస్తే వైసీపీ ప్రభుత్వం అధికారం తుది ఘడియలకు చేరుకుంది. మరో సారి వైసీపీ గెలిస్తే కొత్తగా ప్రమాణం చేయవచ్చు. మంత్రులుగా కొత్తవారు చేరవచ్చు. కానీ ప్రస్తుతం జగన్ తో పాటుగా ఉన్న పాతిక మంది మంత్రులకు మాత్రం ఈ టెర్మ్ తో రుణం తీరినట్లే అని అంటున్నారు.
ఇందులో మళ్లీ ఎంత మంది గెలిచి అసెంబ్లీకి వస్తారు. వైసీపీ గెలిస్తే వారిలో ఎంతమందికి తిరిగి మంత్రి పదవులు కట్టబెడతారు అన్నది మాత్రం చాలా లెక్కల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే లక్కు మీద కూడా ఆధారపడుతుంది.
దీంతో ఏపీలో ఉన్న మంత్రులు అంతా అధికార హోదా అనుభవించిన చాంబర్లకు వీడుకోలు పలకాల్సిన సమయం ఆసన్న మైనట్లే అంటున్నారు. జూన్ 3 వ తేదీ సాయంత్రం లోగా మంత్రులు అంతా తమ చాంబర్లను అప్పగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీని ప్రకారం మంత్రులు అంతా తమ చాంబర్లతో పాటు ప్రభుత్వం ఇచ్చిన సహాయకులను కూడా తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది అని అంటున్నారు. అంతే కాదు ఈ చాంబర్ల నుంచి ఎటువంటి ఫైల్స్ కానీ అలాగే ఇతర సామగ్రి కానీ తరలించడం మీద కూడా నిషేధం విధించినట్లుగా చెబుతున్నారు.
అంతే కాదు సచివాలయంలో తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు అలాగే స్టేషనరీ ఫైల్స్ ని కూడా తీసుకెళ్ల రారదని స్పష్టం చేశారు. అదే విధంగా ఎలాంటి వస్తువులను కూడా తీసుకెళ్ళడం కుదరదు అని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇక సచివాలయానికి వచ్చే ఆయా వాహనాల తనిఖీలు కూడా చేపట్టాలని కోరారు. ఈ మేరకు సచివాలయం సెక్యూరిటీ చూసే ఎస్పీఎఫ్ ని ప్రభుత్వం ఆదేశించింది.
మొత్తం మీద చూస్తే జూన్ 4న కౌంటింగ్ జరిగి ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. అందువల్ల పాత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులకు జూన్ 3 చివరి రోజు కాబోతోంది అని అంటున్నారు. ఆ రోజుతో సచివాలయంలో తమ చాంబర్లకు వారు గుడ్ బై కొట్టాల్సిందే అంటున్నారు.
మరి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో ఎవరు మంత్రులు అవుతారో ఎవరికి ఈ చాంబర్లు కేటాయిస్తారో ఇవన్నీ రానున్న రోజులలో తేలుతుంది. సెంటిమెంట్ గా చేసుకుని కొంతమంది మంత్రులు తమకు ఇష్టమైన చాంబర్లను ఎంచుకున్నారు. మరి కొందరు తమ చాంబర్లను అందంగా డిజైన్ చేయించుకున్నారు. ఇపుడు వాటికి టాటా వీడుకోలూ అని పాడుతూ బరువెక్కిన హృదయంతో ఇంక సెలవ్ అని చెప్పాల్సిందే అంటున్నారు.