ప్యాకేజి ఆఫర్లు పెరిగిపోతున్నాయా ?
ఈ విషయం కేసీయార్ తో పాటు మంత్రులు కేటీయార్, హరీష్ రావులకు ప్రతిరోజు నివేదికలు అందుతున్నాయి.
ఎన్నికల తేదీ దగ్గరపడున్నకొద్దీ ప్యాకేజీ ఆఫర్లు పెరిగిపోతున్నాయట. అయితే ఆశ్చర్యం ఏమిటంటే పెరిగిపోతున్న ప్యాకేజీల ఆఫర్లు జనాలకు కాదు సొంతపార్టీలోని నేతలు, ప్రతిపక్షాల్లోని నేతలకు. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్నికల తేదీ దగ్గరకు వచ్చేస్తున్నా చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతల సహకారం అభ్యర్ధులకు పూర్తిగా అందటంలేదట. ఈ విషయం కేసీయార్ తో పాటు మంత్రులు కేటీయార్, హరీష్ రావులకు ప్రతిరోజు నివేదికలు అందుతున్నాయి.
అభ్యర్ధుల గెలుపుకు పూర్తిగా సహకరించాలని పార్టీ అగ్రనేతలు ఎంతచెప్పినా చాలా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు మనస్పూర్తిగా సహకరించటంలేదని సమాచారం. అందుకనే అభ్యర్ధులను వెళ్ళి ద్వితీయశ్రేణి నేతలతో అరమరికలు లేకుండా మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోవాలని తాజాగా పార్టీ అధిష్టానం నుండి ఆదేశాలు అందాయట. ఇక్కడ అరమరికలు లేకుండా అంటేనే ప్యాకేజీలనే అర్ధం వచ్చేస్తోంది. దాంతో చేసేదిలేక అభ్యర్ధులు ఇపుడు ద్వితీయశ్రేణి నేతలతో భేటీలువుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం.
ఇందులో భాగంగానే ప్రత్యేక ప్యాకేజీలపై మాట్లాడుకుంటున్నారట. ప్రత్యేక ప్యాకేజీలంటే ఎక్కువ భాగం డబ్బుల ప్రస్తావనే ఉంటోందని పార్టీలో టాక్ నడుస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది అనుమానమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో అభ్యర్ధులు ఇచ్చే బిల్లుల రిలీజ్, పదవుల హామీలను నమ్మటానికి సెకెండ్ గ్రేడ్ లీడర్లు సిద్ధంగాలేరు. ఒకవేళ పార్టీ అధికారంలోకి వచ్చినా సదరు సిట్టింగ్ ఎంఎల్ఏ మళ్ళీ గెలుస్తారనే నమ్మకం కూడాలేదు. గడచిన ఐదేళ్ళు అనేకసార్లు ద్వితయశ్రేణి నేతలు ఎన్నిసార్లు ఎంఎల్ఏల చుట్టూ తిరిగినా పనులు చేయలేదనే మంట బాగా పెరిగిపోయింది.
అందుకనే ఆ మంటను ఎన్నికల సమయంలో ద్వితీయశ్రేణి నేతలు అభ్యర్ధలు కమ్ సిట్టింగ్ ఎంఎల్ఏల మీద తీర్చుకుంటున్నారు. తమకు ప్రభుత్వం నుండి రావాల్సిన బిల్లులు మొత్తాన్ని ఇపుడు అభ్యర్ధుల నుండే వసూలు చేసుకుంటున్నారని సమాచారం. అభ్యర్ధుల గెలుపుకు పనిచేయాలంటే క్యాష్ క్యారి విధానం తప్ప మరో మార్గంలేదని అందరికీ అర్ధమైపోయింది. అందుకనే బిల్లుల విషయాన్ని పక్కనపెట్టేసి ముందు డబ్బులిచ్చి అభ్యర్ధులు సర్దుబాటు చేసుకుంటున్నారట. మరి చివరకు ఈ సర్దుబాట్లు ఏమవుతుందో చూడాలి.