కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడికి అరుదైన గౌరవం!

శ్రీకాకుళం టీడీపీ ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడికి అరుదైన గౌరవం లభించింది.

Update: 2024-09-12 07:38 GMT

శ్రీకాకుళం టీడీపీ ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడికి అరుదైన గౌరవం లభించింది. ఆసియా పసిఫిక్‌ సభ్య దేశాల చైర్మన్‌ గా ఆయన ఎన్నికయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా పసిఫిక్‌ దేశాల మంత్రుల సదస్సులో రామ్మోహన్‌ నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన పేరును సింగపూర్‌ ప్రతిపాదించగా భూటాన్‌ సమర్థించింది. ఈ రెండు దేశాలతోపాటు మిగతా దేశాలు ఆమోదం తెలపడంతో రామ్మోహన్‌ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ పౌర విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఆసియా పసిఫిక్‌ సభ్యదేశాల మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు కృషి చేస్తానని వివరించారు. దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా నిర్వహిస్తానని వెల్లడించారు.

ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో పౌర విమానయాన వృద్ధిని రామ్మోహన్‌ నాయుడు వివరించారు. ఈ ప్రాంతంలో వాణిజ్య విమానయానం దాదాపు ఒక శతాబ్దం క్రితమే ప్రారంభమైందని ఆయన గుర్తు చేశారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతం 2035 నాటికి 3.5 బిలియన్‌ డాలర్లతో అతిపెద్ద విమానయాన మార్కెట్‌ గా అవతరిస్తుందన్నారు. దీన్ని మరింత పెంచడానికి సభ్య దేశాలు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఏవియేషన్‌ లో శరవేగంగా పురోగమిస్తోందన్నారు. 2047 నాటికి విమానాశ్రయాల సంఖ్యను దేశంలో 350–400కి పెంచాలని యోచిస్తోందని తెలిపారు. 2014లో 74 ఎయిర్‌ పోర్టుల నుంచి 2024లో 157కి భారత విమానాశ్రయ మౌలిక సదుపాయాలు విస్తరించాయని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

Tags:    

Similar News