ఇటు కేటీఆర్.. అటు హరీష్ రావు

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ దూకుడు పెంచింది

Update: 2023-09-28 17:30 GMT

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ దూకుడు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డెవలప్మెంట్, సంక్షేమ పథకాల కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కానీ రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా బీఆర్ఎస్ లోని ఇద్దరు కీలక నాయకుల్లో ఒకరు కచ్చితంగా అక్కడ ఉంటున్నారు. వాళ్లలో ఒకరు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కాగా మరొకరు మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్కు ప్రధాన స్థంభాలైన ఈ ఇద్దరు నేతలు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రచారాన్ని ఇప్పటి నుంచే హోరెత్తిస్తున్నారు.

తాజాగా సిరిసిల్లా జిల్లా గంభీరావు పేట మండలంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పత్రాలను కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. మరోవైపు హైదరాబాద్లో లులు మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలోనూ కేటీఆర్ పాల్గొన్నారు. ఇక్కడ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న డెవలప్మెంట్, సంక్షేమ పథకాల గురించి చెప్పారు. మొన్నటికి మొన్న నిజామాబాద్ పర్యటనకు వెళ్లి కామారెడ్డి జిల్లాను కూడా కవర్ చేసి వచ్చారు. మరోవైపు ఇతర జిల్లాల్లో ఏ కార్యక్రమం ఉన్నా కేటీఆర్ వెళ్తున్నారు.

మరోవైపు మంత్రి హరీష్ రావు కూడా ఫుల్ యాక్టివ్ అయ్యారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలు చుట్టేస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులో పలు డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. గవర్నర్ను అడ్డుపెట్టుకుని బీజేపీ రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు చేస్తోందని హరీష్ ఆరోపించారు. మొత్తానికి బావ బావమరదులు కలిసి ఇటు ప్రచారంతో పాటు అటు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో దూకుడు కొనసాగిస్తున్నారనే చెప్పాలి. ప్రతి కార్యక్రమానికి కేసీఆర్ బయటకు వచ్చే ఆస్కారమే లేదు. దీంతో పార్టీలో కీలకంగా మారిన కేటీఆర్, హరీష్ లో ఒకరిని తమ జిల్లాలకు బీఆర్ఎస్ నేతలు ఆహ్వానిస్తున్నారు. ఈ నాయకులు వస్తే ప్రజల్లో తమ పాపులారిటీ మరింత పెరుగుతుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.

Tags:    

Similar News