తెనాలి.. పిఠాపురం..అనకాపల్లి.. ఎంతకూ తెగని లెక్కలు
తెలుగుదేశం.. జనసేన మధ్య పొత్తు సంగతేమో కానీ.. రెండు పార్టీలకు సంబంధించి టికెట్ల కోసం ఆశావాహుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది
తెలుగుదేశం.. జనసేన మధ్య పొత్తు సంగతేమో కానీ.. రెండు పార్టీలకు సంబంధించి టికెట్ల కోసం ఆశావాహుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సీట్ల పంచాయితీ తేల్చేందుకు కిందా మీదా పడుతున్నప్పటికీ అవి ఒక కొలిక్కి రావటం లేదు. పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశానికి చెందిన తమ్ముళ్లు పెద్దన్న పాత్రను పోషిస్తూ కర్ర పెత్తనం చేయటానికి సిద్ధం కావటంతో వ్యవహారం అంతకంతకూ ముదురుతోంది. పొత్తులో భాగంగా కొన్ని సీట్ల విషయంలో పంచాయితీ ఉండటం మామూలే. కానీ.. తాజా ఎపిసోడ్ లో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య పొత్తు లెక్కలకు బోలెడన్ని నియోజకవర్గాలు ఉండటంతో.. అవేమీ ఒక కొలిక్కి రాని పరిస్థితి.
రెండు పార్టీలకు చెందిన వర్గాలు టికెట్లు తమకంటే తమకే అన్నట్లుగా వాదనలకు దిగుతున్నాయి. దీంతో.. ఇరు వర్గాల మధ్య పొసగని పరిస్థితి. టికెట్ రేసులో తమకే ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు తమ్ముళ్ల డిమాండ్లు అంతకంతకూ ఎక్కువ అవుతుండగా.. మరోవైపు జనసేన నేతలు గుర్రుగా ఉన్నారు. తమను ఆరో వేలుగా చూస్తున్నారే తప్పించి.. తమకు ఇవ్వాల్సిన మర్యాద తెలుగు తమ్ముళ్లు ఇవ్వటం లేదని వాపోతున్నారు.
దీంతో.. పొత్తులు ఒక కొలిక్కి రాకపోవటమే కాదు.. అంతకంతకూ పీటముడిగా మారుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొందంటున్నారు. వేళ్ల మీద లెక్కిస్తేనే పది నుంచి పదిహేను నియోజకవర్గాలు వస్తున్నాయి. ఇక.. లోతుల్లోకి వెళితే మరిన్ని నియోజకవర్గాలు జాబితాలోకి రానున్నాయి. తెనాలి.. రాజమండ్రి.. అనకాపల్లి.. పిఠాపురం.. కాకినాడ.. అమలాపురం.. రాజోలు.. పోలవరం.. నర్సాపురం.. విజయవాడ పశ్చిమ.. ఆళ్లగడ్డ.. అనంతపురం అర్బన్.. ధర్మవరం.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు భారీగా ఉంటున్న పరిస్థితి.
ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ఇద్దరూ పలుమార్లు భేటీ అయినా.. పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో ఇప్పటికే నెలకొన్న పంచాయితీలు ఒక కొలిక్కి రాకపోవటంపై ఇరు పార్టీలకు చెందిన నేతలు.. ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. దీంతో.. ఇరు పార్టీల మధ్య ఉండాల్సిన స్నేహం కాస్తా.. ద్వేషంగా మారటమే కాదు.. ఎన్నికల్లో ఒకవేళ సీటు దక్కితే ఓడించేందుకే తాము పని చేస్తామంటూఓపెన్ గా మాట్లాడుకోవటం షాకింగ్ గా మారింది.
తెనాలి అసెంబ్లీ సీటు కోసం టీడీపీకి చెందిన ఆలపాటి రాజా ఆశిస్తున్నారు. ఈ స్థానం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తాను బరిలోకి దిగాలని జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ కోరుకుంటున్నారు. అయితే.. నాదెండ్ల మనోహర్ కు అంత సీన్ లేదని.. ఒకవేళ మనోహర్ ను కానీ బరిలోకి దింపితే ఓడిపోయే మొదటి సీటు తెనాలే అవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మిగిలిన సీట్ల సంగతి ఎలా ఉన్నా.. తెనాలి వరకు వస్తే.. పవన్ తర్వాత పార్టీలో నెంబరు 2గా వ్యవహరిస్తున్న మనోహర్ కోరుకున్న సీటు దక్కకపోతే అంతకు మించిన దారుణం ఇంకేమిటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు.
ఒక్క తెనాలి మాత్రమే కాదు.. బోలెడన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పీఠముడులే ఉన్నాయని.. వీటిని ఒకకొలిక్కి తీసుకురాకపోతే మాత్రం ఎన్నికల వేళలో దారుణ పరిణామాల్ని చవిచూడాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెనాలి మాదిరే పొత్తు లెక్కల్ని ఒక కొలిక్కి రాకుండా ఆపుతున్న నియోజకవర్గాల విషయానికి వస్తే.. రాజమండ్రి రూరల్ సీటును రెండు పార్టీలు కోరుకుంటున్నాయి. ఇక్కడి నుంచి తానే పోటీ చేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెబుతుండగా.. అలాంటిదేమీ లేదని సీటు తమదేనని జనసేన నేత కందుల దుర్గేష్ స్పష్టం చేస్తున్నారు.
దీంతో ఇరు వర్గాల మధ్య పోరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. నిత్యం రెండు పార్టీలకు చెందిన నేతలు పోటాపోటీ ప్రకటనలు చేసుకోవటం కనిపిస్తోంది. కాకినాడ జిల్లా పిఠాపురంలోనూ సేమ్ సీన్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ.. జనసేన ఇంఛార్జి ఉదయ శ్రీనివాస్ మధ్య విభేదాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. కాకినాడ రూరల్ సీటును జనసేన నేత పంతం నానాజీకి ఇస్తారని చెబుతుంటే.. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అభ్యంతరం వ్యకతం చేస్తున్నారు. అమలాపురం.. రాజోలు.. పోలవరం.. నర్సాపురం సీట్లలో సేమ్ సీన్ నడుస్తోంది.
క్రిష్ణా జిల్లా విషయానికి వస్తే.. విజయవాడ పశ్చిమ, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ.. అనంతవరం అర్బన్... ధర్మవరం..ఇలా పలు స్థానాల్లో తెలుగుతమ్ముళ్లు.. జనసైనికులు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆయా పార్టీ వేదికల మీదనే కాదు సోషల్ మీడియాలోనూ వాద ప్రతివాదనలు హాట్ హాట్ గా చోటు చేసుకుంటున్నాయి. పీటముడులు పడిన స్థానాల్లో పరిస్థితిని వెంటనే మార్చకపోతే రెండు పార్టీలు దారుణంగా దెబ్బ తినే అవకాశం ఉందంటున్నారు. ఇకనైనా చంద్రబాబు.. పవన్ లు మేల్కొని వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.