ఆ ఫ్యామిలీ మీద సెల్ రాక్షసి నీడ చెల్లిపై అన్న హత్యాచారం
అందుకే.. మరింత జాగ్రత్తగా ఉండేందుకు ఈ సమాచారం తోడ్పడుతుంది.
సాంకేతికత పెరిగే కొద్దీ వెసులుబాట్లు ఎలా వస్తాయో.. చికాకులు అలానే వెంట వస్తుంటాయి. ఈ విషయాన్ని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మొత్తానికే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంటుంది. మధ్యప్రదేశ్ లోని ఒక కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు.. దాని ఎఫెక్టుతో సదరు ఫ్యామిలీ మొత్తం జైలుకు వెళ్లేలా చేసింది. సంచలనంగా మారిన మధ్యప్రదేశ్ ఉదంతం షాకింగ్ గా మాత్రమే కాదు.. ఇలాంటి రాక్షస నీడ ఏ ఇంటి మీద అయినా ఏ క్షణంలో అయినా పడే ప్రమాదం పొంచి ఉంది. అందుకే.. మరింత జాగ్రత్తగా ఉండేందుకు ఈ సమాచారం తోడ్పడుతుంది.
ఇలాంటి సమాచారంతో నెగిటివిటీని మరింత పెంచుతారెందుకు అని వాదించొచ్చు. ఎప్పుడైతే ముప్పును ముందే ఊహించి.. దానికి తగ్గట్లు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నుంచి తప్పించుకునే వీలుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే.. ఈ వార్తను తప్పనిసరిగా చదవాల్సిన అవసరం ఉంది. చదివేటప్పుడు ఇబ్బంది కలగొచ్చు. కానీ.. మారిన ప్రపంచంలో ఇలాంటి దుర్మార్గాలు కూడా చోటు చేసుకునే వీలుంది. అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ లోని రీవా జిల్లాలో తొమ్మిదేళ్ల సోదరిని ఆమె సోదరుడు హత్యాచారం చేశాడు. ఈ ఉదంతంలో బాలిక తల్లిని.. ఇద్దరు అక్కలను.. సోదరుడ్ని అరెస్టు చేసి జైలుకు పంపారు.
మూడు నెలల క్రితం జవా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లోని చిన్నారి అనుమానాస్పదంగా మరణించిందన్న సమాచారం అందింది. ప్రాథమిక విచారణలో.. ఏదో పురుగు కుట్టి చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో శవ పరీక్షకు పంపగా.. అందులో ఆ చిన్నారిపై అత్యాచారం జరిగిందని.. ఆ తర్వాత గొంతు నులిమి చంపినట్లుగా గుర్తించారు. దీంతో ఈ ఉదంతంపై సిట్ ను ఏర్పాటు చేసి.. కుటుంబ సభ్యులను పదే పదే విచారించిన తర్వాత భయంకరమైన నిజం ఒకటి బయటకు వచ్చింది.
ఈ ఏడాది ఏప్రిల్ 24 రాత్రి తొమ్మిదేళ్ల బాలికతో పాటు ఆమె అన్న (పదమూడేళ్లు) ఇంటి ఆవరణలో నిద్ర పోయారు. మొబైల్ ఫోన్ చూస్తున్న అతడు.. అశ్లీల వీడియోలు చూసి ఉద్రేక పడ్డాడు. బాలుడి కన్ను పక్కనే ఉన్న చెల్లి మీద పడింది. అమాంతం ఆమె మీద పడి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో షాక్ కు గురైన సదరు చిన్నారి.. నాన్నకు చెబుతానని చెప్పటంతో భయపడిన ఆ బాలుడు ఆమె గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు. చనిపోయిందని నిర్దారించుకొని పక్కనే పడుకున్న తల్లిని లేపి విషయం చెప్పాడు.
అప్పటికి బాలిక కొన ఊపిరితో ఉంది. దీంతో నిందితుడు మరోసారి చెల్లి గొంతును నులిమి చంపేశాడు. ఇదే సమయంలో బాలుడి అక్కలు (బాలికకు అక్కలే) నిద్ర లేచారు. జరిగిన దారుణం తెలిశాక.. కుటుంబ పరువు కోసం అక్కడున్న ఆధారాలన్ని తొలగించి..నిజాన్ని దాచి పెట్టేశారు. ఉదయం చిన్నారి చనిపోయిన సమాచారం పోలీసులకు వెళ్లింది. వారు ఆరా తీయగా.. విష పురుగు కుట్టిందంటూ తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. ఆ తర్వాత చిన్నారి మరణంలో అనుమానాలు ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందటంతో వారు మరింత ఫోకస్ చేశారు. దాదాపు యాభై మందిని విచారించి.. సాంకేతిక ఆధారాల్ని సేకరించిన తర్వాత కుటుంబ సభ్యుల్ని మరింత గట్టిగా విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో.. ఇంట్లోని నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారటమే కాదు.. సెల్ బూచి కుటుంబాల్లో ఎలాంటి దారుణాలకు కారణమవుతుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చేస్తుందని చెప్పాలి.