1528 - 2024... అయోధ్యలో కొన్ని కీలక ఘట్టాలు!

ఈరోజు అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే

Update: 2024-01-22 05:12 GMT

ఈరోజు అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అయితే 1528 లో ప్రారంభమైన అయోధ్య రామ మందిర వివాదంలో.. నేటి ప్రారంభోత్సవం వరకూ ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా అసలు 1528లో ఈ వివాదం ఎలా మొదలైంది.. 2019లో ఎలా ముగిసింది.. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలేమిటి అనేది ఇప్పుడు చూద్దాం!

అవును... 1528 లో నాడు మొఘల్ చక్రవర్తుల పరిపాలన కాలంలో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి.. అప్పటి చక్రవర్తి బాబర్ పాలనలో కమాండర్‌ గా ఉన్న మీర్ బఖి ఆదేశాలు జారీ చేశారు. అయితే నాడు బాబ్రీ మసీదు నిర్మించిన చోటే.. శ్రీరాముడి జన్మస్థలం అని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో... ప్రధానంగా 1843 నుంచి 1949 వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి. మతపరంగా ఎన్నో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

ఇందులో భాగంగా... 1853, 1859 లో ఈ ప్రాంతంలో మతపరమైన ఘర్షణలు తార స్థాయికి చేరాయి. దీంతో నాడు బ్రిటీష్ ప్రభుత్వం.. అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేసింది. అనంతరం... మసీదు లోపలి భాగంలో ముస్లింలు, వెలుపలి భాగంలో హిందువులు ప్రార్థనలు, పూజలూ చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అప్పటికి ఆ వివాదానికి అలా టెంపరరీ పరిష్కారం చూపించింది ఇంగ్లిష్ ప్రభుత్వం!!

ఇక స్వతంత్ర భారతదేశంలో 1949 సెప్టెంబర్ 23న అయోధ్య వివాదం మరోసారి పీక్స్ కి చేరింది. ఇందులో భాగంగా... మసీదు లోపల రాముడి విగ్రహాలను గుర్తించినట్లు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో మత ఘర్షణలు జరుగుతాయేమో అన్న భావనతో.. మసీదు లోపలి నుంచి విగ్రహాలను తొలగించాలని అప్పటి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది! ఈ నేపథ్యంలో 1950 లో ఫరీదాబాద్ సివిల్ కోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి.

మరోపక్క 1961లో మసీదులోపల ఉన్న విగ్రహాలు తొలగించాలని, అనంతరం వివాదాస్పద భూమిని తమకు అప్పగించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే అనంతర పరిణామాల్లో భాగంగా... 1986లో వివాదాస్పద భూమికి ఉన్న తాళాలను తీసేసి, హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు. ఇలా అప్పటివరకూ జరిగిన వివాదాలు ఒకెత్తు అయితే.. తర్వాత 1992 లో జరిగిన ఘటన మరొకెత్తు.

ఇందులో భాగంగా... 1992 డిసెంబర్ 6న విశ్వహిందు పరిషత్, శివసేన కార్యకర్తలు.. వివాదాస్పద భూమిలోకి చొచ్చుకెళ్లి అక్కడున్న బాబ్రీ మసీదు కట్టడాన్ని ధ్వంసం చేశారు. నాడు ఆ ఘటన దేశవ్యాప్తంగా అత్యంత సంచలనంగా మారింది. ఈ సమయంలో... దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న అనేక చోట్ల మత ఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తర్వాత 2002లో గుజరార్ లో గోద్రా అల్లర్లు జరిగాయి.

ఆ తర్వాత 2010లో అలహాబాద్ హైకోర్టు ఈ వివాదాస్పద భూమిని 3 భాగాలుగా విభజిస్తూ తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా ఆ 3 భాగాలనూ... సున్నీ వక్ఫ్ బోర్డు, రామ్ లల్లా విరాజ్మాన్, నిర్మోహి అఖారాలకు పంచుతూ నిర్ణయం తీసుకుంది. దీన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేయగా.. 2011లో ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ క్రమంలో 2011 - 2016 మధ్య అయోధ్య వివాదం చుట్టూ అత్యున్నత న్యాయస్థానంలో అనేకమార్లు విచారణ జరిగింది.

ఈ క్రమంలో చివరగా 2017లో ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. అయినా ఫలితం రాకపోవడంతో 2019 మార్చి 8న అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం కోసం 8 వారాల గడువు ఇస్తున్నట్టు ప్రకటించింది! అయితే ఆ మధ్యవర్తిత్వం ద్వారా కూడా ఎలాంటి పరిష్కారం లభించలేకపోవడంతో... 2019 ఆగస్ట్ 2న సుప్రీంకోర్టుకు మీడియేషన్ ప్యా నెల్ నివేదికను అందించింది.

ఈ క్రమంలో 2019 నవంబర్ 9న ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత ధర్మాసనం.. అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రక తీర్పును వెలువరించింది. ఇందులో భాగంగా... 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి, మరో 5 ఎకరాలను మసీదు నిర్మాణానికి అప్పగిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దీంతో... 2020 ఆగస్ట్ 5న.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.

Tags:    

Similar News