ఆ పేరుతో పవన్ కల్యాణ్ కోరికను తీర్చిన బాబు
పవన్ పుణ్యమా అని ఆ అలవాటుకు కాస్తంత బ్రేక్ పడిందని చెప్పాలి.
మనసులోని ఆలోచనల్ని మాటల్లో చెప్పటం జనసేన అధినేత.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు అలవాటు. తనపై అమితంగా ప్రభావితం చేసే వ్యక్తులను తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు పవన్ కల్యాణ్. కొన్ని దశాబ్దాలుగా ఏపీ రాజకీయాల్ని.. ఏపీ పగ్గాల్ని అందుకున్న ప్రభుత్వాల్ని చూస్తే.. మూసధోరణిలో కొన్ని పేర్లనే ప్రభుత్వ పథకాలకు పెట్టటం అలవాటుగా మారింది. పవన్ పుణ్యమా అని ఆ అలవాటుకు కాస్తంత బ్రేక్ పడిందని చెప్పాలి.
గోదావరి జిల్లాలకు చెందిన డొక్కా సీతమ్మ పేరును పలుమార్లు ప్రస్తావిస్తుంటారు పవన్ కల్యాణ్. ఎలాంటి ప్రయజనాల్ని ఆశించకుండా నలుగురికి సాయం చేయటమే లక్ష్యంగా సాగిన డొక్కా సీతమ్మ ఉదంతాన్ని ఇప్పటితరానికి తెలియజేయటానికి ప్రయత్నిస్తూ ఉండే వపన్.. అన్నా క్యాంటీన్ల మాదిరే డొక్కా సీతమ్మ క్యాంటీన్ల పేరుతోనూ నిర్వహించాలని ఆ మధ్యన కోరటం తెలిసిందే. ఒక పథకానికి ఒక పేరు ఉన్నప్పుడు.. మరో పేరు పెట్టటం సాధ్యం కాదు. అందునా అన్నా క్యాంటీన్ల విషయంలో తెలుగుదేశానికి ఉన్న కమిట్ మెంట్ గురించి అందరికి తెలిసిందే.
అయినప్పటికీ.. అన్నా క్యాంటీన్ల తరహాలోనే డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు నిర్వహించాలన్న పవన్ సూచనను చంద్రబాబు మరోలా పూర్తి చేశారు. తాజాగా ఆమె పేరును ప్రభుత్వం నిర్వహించే కీలక పథకానికి పెట్టటం ద్వారా పవన్ కల్యాణ్ కోరికను తీర్చారని చెప్పాలి. గత ప్రభుత్వంలో జగనన్న గోరు ముద్దు పేరును మార్చి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. దీంతో.. పవన్ కోరికను చంద్రబాబు తీర్చినట్లైంది. డొక్కా సీతమ్మ పేరు ఈ తరానికి తెలియజేయాలన్న పవన్ ఆశయం నెరవేరిందని చెప్పాలి.
అంతేకాదు.. గత ప్రభుత్వంలో అమలు చేసిన పలు పథకాల పేర్లను మారుస్తూ కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆ మార్పుల్ని చూస్తే..
- జగనన్న అమ్మఒడి పేరు ‘‘తల్లికి వందనం’’
- జగనన్న విద్యా కానుక పథకాన్ని ‘‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’’
- జగనన్న గోరుముద్దు కార్యక్రమాన్ని ‘‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’’
- మన బడి - నాడు నేడు కార్యక్రమాన్ని ‘‘మన బడి మన భవిష్యత్తు’’
- స్వేచ్ఛ పథకాన్ని ‘‘బాలికా రక్ష’’
- జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమాన్ని ‘‘అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం’’