మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్‌ని పట్టించిన పుష్ప రాజ్
అయితే అలాంటి స్మగ్లర్ ని చూసి స్ఫూర్తి పొందాలని థియేటర్ కి వచ్చిన ఓ రియల్ స్మగ్లర్ అడ్డంగా బుక్కయ్యాడు.
పుష్పరాజ్ ఎదురేలేని ఒక స్మగ్లర్. ఎర్రచందనం స్మగ్లింగ్ ని ఇంటర్నేషనల్ రేంజుకి తీసుకెళ్లిన ఖిలాడీ స్మగ్లర్. అయితే అలాంటి స్మగ్లర్ ని చూసి స్ఫూర్తి పొందాలని థియేటర్ కి వచ్చిన ఓ రియల్ స్మగ్లర్ అడ్డంగా బుక్కయ్యాడు. అతడిని అరెస్ట్ చేసి పోలీసులు జైల్లో వేసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఒక మల్టీప్లెక్స్‌లో అర్థరాత్రి `పుష్ప 2` స్క్రీనింగ్‌కు హాజరైన సినీ ప్రేక్షకులు అకస్మాత్తుగా థియేటర్‌లోకి వచ్చిన పోలీసులను చూసి షాక్ తిన్నారు. అయితే పోలీసులు థియేటర్‌లోకి ఎందుకు వచ్చారు? అని ఆరా తీయగా ప్రజలకు షాకిచ్చే విషయం తెలిసింది. రెండు హత్యలు, స్మగ్లింగ్ సహా తీవ్రమైన నేర కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఒక స్మగ్లర్‌ని పట్టుకోవడానికి పోలీసులు సినిమా హాల్‌పై దాడి చేసారని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఈ ఛేజ్ సీన్ నిజ జీవిత యాక్షన్ సీన్‌ని తలపించింది.
విశాల్ మెష్రామ్ అనే డ్రగ్స్ స్మగ్లర్‌ని అరెస్టు చేసిన పోలీసులు అతడిని తీసుకుని వెళుతూ ప్రేక్షకులను ఇబ్బందిపడకుండా సినిమా చూడాల్సిందిగా కోరారు. విశాల్ మెష్రామ్ 10 నెలలుగా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. దొరక్కుండా తిరుగుతున్నాడు. కొత్తగా విడుదలైన పుష్ప 2 థియేటర్ వద్ద పార్క్ చేసిన వెహికల్ నంబర్ ఆధారంగా పోలీసులు అతడిని కనిపెట్టారని పచ్‌పోలీ(నాగ్ పూర్) పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి ఒకరు తెలిపారు. మెష్రామ్ పై క్రిమినల్ రికార్డ్‌లో 27 కేసులు ఉన్నాయి. ఇందులో రెండు హత్యలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు ఉన్నాయి. అతడు అత్యంత ప్రమాదకారి. హింసాత్మక ప్రవర్తన, నేర చరిత్ర కలిగిన క్రిమినల్. గతంలో పోలీసు అధికారులపైనా దాడికి పాల్పడ్డాడు. అయితే కొన్ని ఏజెన్సీలు సైబర్ నిఘా పద్ధతులను ఉపయోగించి అతడిని చాలా జాగరూకతతో వెంబడించాయి.
అతడు కొత్తగా కొనుగోలు చేసిన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV)లో ఎటువైపు ప్రయాణిస్తున్నాడో ప్రతిదీ పరిశీలించారు పోలీసులు. ఎట్టకేలకు సినిమా బయట పార్క్ చేసిన అతడి వాహనం అతడిని పట్టించింది. సినిమా క్లైమాక్స్ కి చేరుకున్న సమయంలో అతడిని చుట్టుముట్టి ప్రతిఘటించే అవకాశం ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్న అతడిని త్వరలో నాసిక్‌లోని జైలుకు తరలించనున్నారు. పుష్ప 2 విడుదలై మూడోవారంలోను బంపర్ కలెక్షన్స్ తో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.