నాయుడు గారి జిల్లాపై రెడ్డి గారు, రెడ్డి గారి జిల్లాపై నాయుడు గారు
ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న కొద్దీ రెండు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీలు పరస్పరం బలమైన జిల్లాలపై దృష్టిపెట్టి నట్లున్నాయి.
ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న కొద్దీ రెండు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీలు పరస్పరం బలమైన జిల్లాలపై దృష్టిపెట్టి నట్లున్నాయి. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపపై చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కడప జిల్లాలోని 10 సీట్లలో ఎన్ని వీలైతే అన్ని సీట్లను గెలుచుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అలాగే చంద్రబాబు సొంతజిల్లా చిత్తూరులోని 14 నియోజకవర్గాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అక్కడ 13 చోట్ల గెలిచింది.
ఈ రెండు జిల్లాలను వదిలేస్తే ఇద్దరు అధినేతలు ప్రధానంగా దృష్టిపెట్టింది ఉత్తరాంధ్ర మీదే అన్న విషయం తెలుస్తోంది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లున్నాయి. పోయిన ఎన్నికల్లో వైసీపీ 26 నియోజకవర్గాల్లో గెలిచింది. రాబోయే ఎన్నికల్లో అన్నీ గెలవాలన్న ది జగన్ టార్గెట్. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో పోయిన పూర్వవైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలన్నది చంద్రబాబు పట్టుదల. అందుకనే ఉత్తరాంధ్రలో పదేపదే పర్యటిస్తున్నారు. మొదటి నుండి ఉత్తరాంధ్ర టీడీపీకి బలమైన ప్రాంతం. కాకపోతే మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి షిఫ్టయ్యింది.
ఇక రెండు పార్టీలు గట్టిగా దృష్టిపెట్టిన మూడో ప్రాంతం ఏమిటంటే ఉభయగోదావరి జిలాలు. ఈ రెండు జిల్లాల్లో 34 అసెంబ్లీలున్నాయి. ఇపుడు వైసీపీకి 27 మంది ఎంఎల్ఏలున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఏ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకుంటే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందనే సెంటిమెంటుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకున్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లో కాపులు ఎక్కువగా ఉన్నారనే ప్రచారం కూడా తప్పే. ఎందుకంటే రెండు జిల్లాల్లో కాపుల కన్నా బీసీలు, ఎస్సీలు చాలా ఎక్కువగా ఉన్నారు. కాని ప్రచారం మాత్రం ఉభయగోదావరి జిల్లాల్లో కాపులెక్కువని జరుగుతోంది. పవన్ కూడా కాపు సామాజికవర్గమే కాబట్టి మొత్తం కాపులంతా జనసేన, టీడీపీకి ఓట్లేస్తారని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. పై జిల్లాల్లోనే రెండు పార్టీలు బలమైన అభ్యర్థులను పోటీలోకి దింపుతున్నాయి. మిగిలిన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు కూడా కీలకమే అయినా ఎందుకనో జగన్, చంద్రబాబు పైన చెప్పుకున్న ప్రాంతాలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అర్ధమవుతోంది.