జనసేనకు బాబు ఇచ్చే సీట్లు అవేనట...!?
ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు ఎన్ని సీట్లు ఇస్తారు అన్న ఆసక్తి నానాటికీ పెరిగిపోతోంది. అయితే టీడీపీ అధినాయకత్వం ముందు అన్ని లెక్కలూ ఉన్నాయని అంటున్నారు.
జనసేనకు టీడీపీ పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు ఇస్తుంది. ఇది అతి పెద్ద ప్రశ్నగా మారింది. రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. నిజానికి పొత్తు పార్టీలు ఎపుడూ ఈ విధంగా ఇంత టెన్షన్ తో సీట్ల పంచాయతీలో ఉన్న ఘటనలు లేవు. ఆదికి ముందే రెండు పార్టీలూ పొత్తు పెట్టుకున్నాయి. దీంతో చాలా కాలం ముందే జనసేన టీడీపీ జోరు చేయబోతున్నాయని అంతా భావించారు.
కానీ చివరికి స్పీడ్ బ్రేకర్ గా పొత్తులో దక్కే సీట్లే మారాయి. నెలలు గడుస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పొత్తు సీట్లు ఎన్ని అన్నది మాత్రం తెలియడంలేదు. జనసేనకు ఎన్ని సీట్లు టీడీపీ ఇస్తుంది అన్నది పక్కన పెడితే కాపు నేతలు కొంతమంది గౌరవ ప్రదమైన సీట్లు అంటూ అరవైకి తగ్గకుండా తీసుకోవాలని కోరుతున్నారు.
మూడవ వంతు సీట్లు జనసేనకు ఇస్తేనే మంచిది. అలాగైతేనే ఓట్ల సర్దుబాటు సజావుగా సాగుతుందని కూడా సూచిస్తున్నారు. ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు ఎన్ని సీట్లు ఇస్తారు అన్న ఆసక్తి నానాటికీ పెరిగిపోతోంది. అయితే టీడీపీ అధినాయకత్వం ముందు అన్ని లెక్కలూ ఉన్నాయని అంటున్నారు. అన్ని దగ్గర పెట్టుకునే పొత్తు సీట్లు నిర్ణయిస్తారు అని అంటున్నారు.
జనసేనకు ఇచ్చే సీట్లు ఇరవై నుంచి ముప్పయి లోపు అన్నది తాజాగా వినిపిస్తున్న మాటగా ఉంది. ఈ సీట్లలో ఉభయ గోదావరి జిల్లాలలో ఎక్కువగా ఇచ్చి ఉత్తరాంధ్రాలో మరి కొన్ని సీట్లు ఇచ్చి ఆ మీద కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలలో బలమున్న చోట్ల సీట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారుట.
అలా చూసుకుంటే చిత్తూరు జిల్లాలో మదనపల్లి, తిరుపతి, అలాగే కర్నూలు జిల్లాలో ఒకటి, కడప, అనంతపురంలో ఒకటి సీట్లు ఇస్తారని అంటున్నారు. ఇక ఒంగోలు జిల్లాలో దర్శితో పాటు చీరాల, నెల్లూరులో నెల్లూరు రూరల్ లేదా మరో చోట అయినా ఒక సీటు ఇస్తారని అంటున్నారు. గుంటూరు క్రిష్ణా జిల్లాలలో చెరి రెండేసి సీట్లు ఇస్తారని అంటున్నారు.
ఇక మిగిలిన సీట్లలో పది దాకా సీట్లు ఉభయ గోదావరి జిల్లాలో ఇస్తారని, మరో అరడజన్ దాకా సీట్లు ఉత్తరాంధ్రాలో ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇక జనసేనకు రెండు నుంచి మూడు పార్లమెంట్ సీట్లు ఇస్తారని అందులో అనకాపల్లిలో ఒకటి, నర్సాపురంలో ఒకటి, అలాగే కాకినాడ అయినా మచిలీపట్నం అయినా మూడవదిగా ఇస్తారని అంటున్నారు. ఈ విధంగా జనసేనతో సీట్ల పంచాయతీని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు అని అంటున్నారు. జనసేన నుంచి ఆశావహులందరికీ సీట్లు దక్కుతాయి. అలాగే ఆ పార్టీలో ఇటీవల చేరిన వారికి కూడా సీట్లు దక్కుతాయి.
ఇక బయట నుంచి ఎవరైనా ఏదైనా మాట్లాడినా లేక కొత్త డిమాండ్లు పెట్టినా పట్టించుకోకుండా టీడీపీ జనసేన రెండు పార్టీలు కలసి ఎన్నికల గోదాలోకి దిగాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మరో వారంలో జనసేన టీడీపీ సీట్ల పంచాయతీ పూర్తిగా కొలిక్కి వస్తుందని అంటున్నారు.