ఇంటర్నేషనల్ విద్యార్థులకు యూఎస్ 'ఓపీటీ' షాక్ ఇవ్వబోతోందా?

ఈ ఓపీటీని అమెరికా టెక్ వర్కర్స్ గ్రూప్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీన్ని మారువేషంలో ఉన్న అతిథి కార్మికుల పథకంగా అభివర్ణించిందని అంటున్నారు.

Update: 2025-01-03 05:20 GMT

అమెరికా ప్రెసిడెంట్ గా ఈ నెలలో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేళ ఇంటర్నేషనల్ విద్యార్థులకు సరికొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందనే చర్చ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇమ్మిగ్రేషన్స్ విషయంలో ట్రంప్ సర్కార్ సరికొత్త సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథయంలో తాజాగా ఓపీటీ విషయం తెరపైకి వచ్చింది.

అవును... అమెరికాలో స్టెమ్మ్ కోర్సుకు వెళ్లే విద్యార్థులకు ఐదేళ్ల విద్యార్థి వీసా దొరుకుతుంది. ఇందులో రెండేళ్ల మాస్టర్ డిగ్రీ తర్వాత మిగిలిన మూడు సంవత్సరాల పాటు ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) లభిస్తుంది. అయితే... దీనిపై ఇప్పుడు చర్చ మొదలైందని అంటున్నారు. దీన్ని అమెరికన్ జాబ్ మార్కెట్ లోకి 'బ్యాక్ డోర్' ఎంట్రీగా పరిగణిస్తూ స్పందిస్తున్నారు.

అయితే... ఈ ఓపీటీ అనేది సాంప్రదాయ మార్గాలను దాటవేస్తూ దీర్ఘకాలిక ఇమ్మిగ్రేషన్ మార్గంగా మారిందని.. అమెరికన్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇది దుర్వినియోగం అవుతుందనే వాదనలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ ప్రోగ్రాం కు కాంగ్రెస్ ఆమోదం లేదని చెబుతున్నారు. యూఎస్ గ్రాడ్యుయేట్లతో అన్యాయంగా పోటీకి ఇది సహకరిస్తుందని అంటున్నారు.

ఈ ఓపీటీని అమెరికా టెక్ వర్కర్స్ గ్రూప్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీన్ని మారువేషంలో ఉన్న అతిథి కార్మికుల పథకంగా అభివర్ణించిందని అంటున్నారు. దీనిపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. విశ్వవిద్యాలయాలు విద్యకు బదులుగా వర్క్ పర్మిట్ లను విక్రయిస్తున్నాయని.. అమెరికన్ గ్రాడ్యుయేట్ లను రక్షించడానికి ట్రంప్ ఈ ఓపీటీని ముగించాలని కోరింది.

వాస్తవానికి భారతీయ విద్యార్థులు.. ప్రధానంగా వృత్తిపరమైన అవకాశాలు, హెచ్-1బీ వీసాల మార్గాల కోసం ప్రోగ్రామ్ పై ఎక్కువగా ఆధారపడతారు. ఈ క్రమంలో 2023లో వాషింగ్టన్ అలయన్స్ ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ ఈ కార్యక్రమాన్ని కోర్టులో సవాల్ చేయగా.. దీని చట్టబద్ధతను ధృవీకరిస్తూ దిగువ కోర్టు ఈ ఓపీటీ కార్యక్రమాన్ని సమర్థించింది.

ఏది ఏమైనా... మరి కొన్ని రోజుల్లో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో.. ఓపీటీ ప్రోగ్రాం భవిష్యత్తూ అనిశ్చితంగానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీన్ని కొంతమంది రద్దూ చేయాలని వాదిస్తుండగా.. అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించడానికి, యూఎస్ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి ఇది చాలా ముఖ్యమైనదని మరికొంతమంది సమర్థిస్తున్నారు. మరి దీనిపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.

Tags:    

Similar News