దుబాయ్ లో దాయాదికి దారుణం అవమానం
పాకిస్థాన్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చేసుకున్నోడికి చేసుకున్న మహదేవ అని ఊరికే అనలేదు. నిద్ర లేచింది మొదలు భారత్ నాశనాన్ని.. దాని ఏదో రకంగా దెబ్బేయాలన్న ఆలోచన తప్పించి.. సొంతంగా ఎదగాలి.. దేశ ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచాలన్న ఉద్దేశం లేని పాకిస్థాన్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓపక్క దేశ అంతర్గత పరిస్థితులు ఆరాచకమన్నట్లుగా మారిన వేళ.. దేశంలో లేకుండా విదేశాల్లో ఉన్న పాకిస్థానీయులు తామున్న ప్రాంతంలో వ్యవహరించిన తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
తమ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేళలో దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై తమ దేశ పతకాన్ని ఆవిష్కరిస్తారన్న ఉద్దేశంతో అక్కడికి చేరుకున్న పాకిస్థానీయులు ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో అనవాయితీ ప్రకారం.. ఏదైనా మిత్రదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. ఆ దేశ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తారు. దీన్ని చూసేందుకు ఆయా దేశ వాసులు అక్కడకు చేరుకుంటారు.
ఆగస్టు 14న పాకిస్థాన్ కు స్వాంత్య్రం రావటం.. అదే రోజు అర్థరాత్రి భారత్ కు స్వాతంత్య్రం రావటంతో.. ఒక రోజు ముందుగా పాక్.. తర్వాతి రోజు భారత్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవటం తెలిసిందే. అయితే.. తమ స్వాతంత్ర్య దినోత్సవ వేళ పాకిస్థాన్ జెండాను కూడా ప్రదర్శిస్తారన్న ఉద్దేశంతో దుబాయ్ లోని పాకిస్థానీయులు అక్కడకు భారీ ఎత్తున తరలి వచ్చారు. కానీ.. వారి ఆశల్ని వమ్ము చేస్తూ.. పాక్ జాతీయ పతాకాన్ని ప్రదర్శించలేదు. దీనిపై అక్కడి అధికారులపై పాకిస్థానీయులు తమ అసంతృప్తి ప్రదర్శించారు.
ఇదిలా ఉంటే.. పంద్రాగస్టున భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాత్రం బుర్జ్ ఖలీఫాపై భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శించటమే కాదు.. భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వేల సంఖ్యలో వచ్చిన పాకిస్థానీయులు మాత్రం నిరాశతో.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఒక మహిళ ఇది తమకు పరువు సమస్యగా పేర్కొనటం.. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. పాకిస్థానీయులు నినాదాలు చేసిన తర్వాత కూడా అక్కడి అధికారులు పట్టించుకోకపోవటం ఆ దేశానికి జరిగిన దారుణ పరాభవంగా వ్యాఖ్యానిస్తున్నారు.