‘మిమ్మల్ని తిట్టినోళ్లంతా ఓడారు’.. దీనికి రజనీ రియాక్షన్ ఇదే

ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్ ను.. కారు వద్దకు తీసుకెళ్లేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది.

Update: 2024-06-12 04:20 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరటానికి మరికొంత టైం మాత్రమే మిగిలి ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ జాతీయ అంతర్జతీయ ప్రముఖులు పలువురు విజయవాడకు వస్తున్నారు. వీరిలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు. ఆయనకు గన్నవరం ఎయిర్ పోర్టులో అపూర్వ స్వాగతం లభించింది. రజనీకాంత్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు.

ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్ ను.. కారు వద్దకు తీసుకెళ్లేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఎయిర్ పోర్టుకు వచ్చిన రజనీకాంత్ ను రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన నేతల్లో ఒకరు బాలశౌరీ. ఎన్నికల వేళలో జనసేనలో చేరిన ఆయన.. రజనీతో తనకున్న గత పరిచయంతో ఆయన్ను పలుకరించారు. ఈ సందర్భంగా బాలశౌరి నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. వివిధ అంశాల మీద మాట్లాడిన బాలశౌరీ.. ‘గతంలో మీరు చంద్రబాబును పొగిడినప్పుడు వైసీపీ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో వారంతా ఓడిపోయారు’’ అని వ్యాఖ్యానించారు.

దీనికి స్పందించిన రజనీకాంత్ చిరునవ్వుతో స్పందిస్తూ మనకు నచ్చింది మాట్లాడతాం.. దానికే తిడితే ఎలా? అలా తిట్టకూడదంటూ సున్నితంగా బదులిచ్చారు. వారి సంభాషణలో బాలశౌరి జనసేనలో చేరిన అంశాన్ని ప్రస్తావించిన రజనీకాంత్.. ‘జనసేలో చేరి మంచి పని చేశారు. పవన్ కల్యాణ్ మంచి నాయకుడు అవుతారు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన రజనీకాంత్ ఆ సభలో తన మిత్రుడు చంద్రబాబును ప్రశంసిస్తూ మాట్లాడటం తెలిసిందే.

చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని.. ఆ విషయాన్ని దేశంలోని పెద్ద పెద్ద నాయకులే చెబుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఘనత ఏమిటో బయటవాళ్లకు తెలుసని కొనియాడారు. ఈ పొగడ్తలపై అప్పటి మంత్రులు కొడాలి నాని.. పేర్నినాని.. ఆర్కే రోజా తదితరులు తీవ్రంగా ఫైర్ అయ్యారు. రజనీకాంత్ నీచాతినీచమైన వ్యక్తిగా అప్పట్లో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆర్కే రోజా సైతం ఏపీ రాజకీయాలపై అవగాహన లేకుండా మాట్లాడారంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెను చర్చకు దారి తీసింది.

Tags:    

Similar News