బరాబర్.. గద్దర్‌కు 'పద్మ' ఇవ్వం: బండి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో పద్మ అవార్డుల విషయం రాజకీయ రంగు పులుముకుంది. తాము పంపించిన సిఫారసుల ను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది.
తెలంగాణలో పద్మ అవార్డుల విషయం రాజకీయ రంగు పులుముకుంది. తాము పంపించిన సిఫారసుల ను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ నాయకుడు, ప్రముఖ గాయకుడు గద్దర్ వంటివారికి పద్మ అవార్డు ఇవ్వలేదని యాగీ చేస్తున్నవారు అజ్ఞానులేనని వ్యాఖ్యానించారు. ``బరాబర్ గద్దర్‌కు పద్మ ఇవ్వం`` అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. బీజేపీ నాయకులను హత్య చేసిన వారిలో గద్దర్ కూడా ఉన్నారని బండి మరో తీవ్ర వ్యాఖ్య చేయడం గమనార్హం. నక్సల్స్‌కు, దేశ ద్రోహులకు, హంతకులకు పద్మ అవార్డులు ఎవరైనా ఇస్తరా? అని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే.. ప్రభుత్వం మంచి వ్యక్తులను ప్రోత్సహించాలని.. ఆమేరకు పేర్లు పంపి కేంద్రానికి సిఫారసు చేసుకోవాలని ఆయన సూచించారు. కానీ, గద్దర్ వంటి వ్యక్తులకు పద్మ అవార్డులు ఇవ్వమని అడగడం తప్పని వ్యాఖ్యానించారు.
పద్మ అవార్డులకు ఎంపికైన వారంతా అర్హులేనని బండి చెప్పారు. అర్హత లేని వారికి పదవులు ఇస్తే.. అర్హ త లేని వారికి పద్మాలు ఇవ్వాలని కోరతారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. కేంద్రం ఇచ్చే నిధులతో చేపట్టే పనులకు, ప్రాజెక్టులకు కేంద్ర సూచించిన వారి పేర్లే పెట్టాలని అన్నారు. ఎక్కడో విదేశాల్లో నక్కిన వారి పేర్లు పెడతామంటే కుదరదని వ్యాఖ్యానించారు. మరోవైపు.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన సిఫారసులను కూడా కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించడం గమనార్హం.