కేటీఆర్ కంటే హరీష్ కు క్రెడిబిలిటీ ఎక్కువ: బండి సంజయ్
కేటీఆర్ కు కళ్లు నెత్తికెక్కాయని, ప్రధాని మోదీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని తిట్టిన కేటీఆర్ సాయంత్రానికి సెటిల్ చేసుకుంటారని బండి సంజయ్ విమర్శించారు. కేటీఆర్ కు కళ్లు నెత్తికెక్కాయని, ప్రధాని మోదీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ కంటే హరీష్ రావు క్రెడిబులిటీ ఉన్న లీడర్ అని ప్రశంసించారు. రేవంత్ రెడ్డిని కాపాడుతోంది కేటీఆర్ అని విమర్శించారు.
కేటీఆర్ యాక్టింగ్ సీఎంలా తయారయ్యారని, తాను, రేవంత్ ఒకటేనని చెప్పేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని చురకలంటించారు. బీఆర్ఎస్ కు రాజకీయ భవిష్యత్తు లేదని, కేటీఆర్ అహంకారాన్ని దించుతామని చెప్పారు. కేటీఆర్ నోటీసులకు రిప్లై ఇచ్చినా...ఆయన ఎందుకు సమాధానం చెప్పడంలేదని ప్రశ్నించారు. కేటీఆర్ కు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని బండి సంజయ్ నిలదీశారు. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరని సంజయ్ విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రోజుకో అంశాన్ని ప్రస్తావించి మళ్లీ దాని ఊసెత్తడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ లు కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎదుగుతున్న బీజేపీపై రెండు పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని, కానీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతల మాటలు జనం నమ్మరని చెప్పారు.