అరెరె.. బండిని తప్పించి గాడి తప్పామా? బీజేపీ అంతర్మథనం
సరిగ్గా ఏడాది కిందటి వరకు తెలంగాణలో అధికారం దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపించిన బీజేపీ ఇప్పుడు పూర్తిగా వెనుకబడినట్లుగా కనిపిస్తోంది
సరిగ్గా ఏడాది కిందటి వరకు తెలంగాణలో అధికారం దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపించిన బీజేపీ ఇప్పుడు పూర్తిగా వెనుకబడినట్లుగా కనిపిస్తోంది. అందులోనూ ఎన్నికలకు మూడు నెలల ముంగిట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చి రేసులో వెనుకబడిపోయింది. సరే.. దానిని పార్టీ అంతర్గత వ్యవహారంగా భావించినా, ఎన్నికల నాటికైనా పుంజుకోలేదు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారం కోసం హోరాహోరీగా తలపడుతుంటే,బీజేపీ ప్రేక్షక పాత్రకే పరిమితం అయినట్లుగా స్పష్టమవుతోంది.
బీసీ సీఎం నినాదంతో రికవరీకి యత్నం
2000 సంవత్సరం నుంచి ఇటీవలి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు బండి సంజయ్. వివిధ కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టడం ద్వారా పార్టీని బలోపేతం చేశారు. పెద్దఎత్తున పర్యటనలు చేసి ప్రజల్లోకి వెళ్లారు. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో కాషాయ పార్టీ గ్రాఫ్ ను పెంచారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిత్యం వార్తల్లో నిలిచారు. వివిధ పార్టీల నుంచి నాయకులను బీజేపీలోకి ఆకర్షించారు. అలాంటి సంజయ్ ను ఎన్నికల ముంగిట రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బీజేపీ.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇది అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఆ నష్టం.. తెలంగాణ ఎన్నికల్లోనూ వెంటాడుతోంది. దీంతో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామంటూ బీజేపీ అనూహ్య ప్రకటన చేసింది. కానీ, ఇదేమంత నష్ట నివారణకు ఉపయోగపడడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో నాయకుడికీ ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ ఆయనను పూర్తిగా నమ్మలేని పరిస్థితుల్లో బీజేపీ ఉంది. దీనికితోడు సీనియర్లు వరుసగా నిష్క్రమిస్తుండడంతో కమలం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
సంజయ్ కు మళ్లీ పెద్దపీట..
వాస్తవాన్ని గ్రహించిన బీజేపీ అధిష్ఠానం.. బండి సంజయ్ కు మళ్లీ పెద్ద పీట వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆయనను ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా వాడుకునే ఆలోచన కూడా చేస్తోంది. సంజయ్ పోరాట పటిమను ప్రశంసిస్తూ.. బీసీ సీఎం అని పేర్కొంటూ ముందుకెళ్తోంది. కాగా, వరుసగా అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్న సంజయ్ సైతం.. పార్టీ బీసీ సీఎం ప్రకటనను ఉదహరిస్తూ, మిగతా పార్టీలేవీ ఆ మేరకు ప్రకటన చేయలేవంటూ పేర్కొంటున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడిని అనవసరంగా మార్చామా?
నిరుటి వరకు దూసుకెళ్లిన పార్టీ నేడు ఈ స్థితిలో ఉండడానికి చేజేతులా తామే కారణమయ్యామనే అభిప్రాయం బీజేపీ వర్గాల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ''రాష్ట్ర అధ్యక్షుడిని మారిస్తే ఇంత ప్రభావం ఉంటుందని అనుకోలేదు'' అనే భావన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ తో ఎంత అవగాహన ఉన్నప్పటికీ తమ నిర్ణయం ఇంతగా బెడిసికొడుతుందని భావించలేదని కాషాయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో పుట్టిందే.. బీసీ సీఎం ప్రకటన అని చెబుతున్నాయి. . మరి.. తెలంగాణ ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం..?