లోక్ సభలో కేటీఆర్ భార్య ఆస్తుల లెక్క చెప్పిన బండి
కేటీఆర్ సతీమణి ప్రస్తావన వచ్చేది కాదు. తాజాగా ఆ విషయాల్ని వెల్లడించారు బండి.
తెలంగాణ అధికారపక్షంలో షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారంటూ తరచూ విమర్శలు ఎదుర్కొనే ముఖ్యమంత్రి కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ తాజాగా వార్తల్లో నిలిచారు. కేంద్రంపై విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వేళ.. మోడీ సర్కారుపై విరుచుకుపడిన పార్టీలకు సమాధానంగా ఆ పార్టీ ఎంపీలు సమాధానం ఇవ్వటం తెలిసిందే. బీఆర్ఎస్ కీలక నేతల్లో ఒకరైన మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి చూపు పడేలా చేశాయి.
ఎందుకంటే.. ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో మంత్రి కేటీఆర్ సతీమణి ఆస్తుల లెక్కను చెప్పిన బండి ఆశ్చర్యానికి గురి చేశారు. ఇంతవరకు ఆస్తుల లెక్క వచ్చినప్పుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పిల్లలు కవిత.. కేటీఆర్.. మేనల్లుడు హరీశ్.. లేదంటే రాజ్యసభ ఎంపీ సంతోష్ మీదే ఆరోపణలు.. విమర్శలు వచ్చేవే తప్పించి.. కేటీఆర్ సతీమణి ప్రస్తావన వచ్చేది కాదు. తాజాగా ఆ విషయాల్ని వెల్లడించారు బండి.
తెలంగాణలో పవర్ లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కొడుకు ఆస్తులు 400 రెట్లు పెరిగాయని.. ఆయన సతీమణి ఆస్తులు 1800 వాతం పెరిగినట్లుగా చెప్పారు. తెలంగాణ రైతుల సగటు ఆదాయం రూ.1,12,836 కాగా.. కేసీఆర్ వ్యవసాయ ఆదాయం మాత్రం రూ.కోటిగా పేర్కొన్నారు. కేసీఆర్ ఆదాయం రైతుల ఆదాయం 5 వేల శాతం ఎక్కువన్న బండి సంజయ్.. కోడలి ఆదాయం 2 వేల శాతం ఎక్కువంటూ ఆసక్తికర గణాంకాల్ని ప్రస్తావించారు.
బీఆర్ఎస్... మజ్లిస్.. కాంగ్రెస్ మూడు పార్టీలు ఒక్కటేనన్న బండి.. ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ కు వెళ్లలేదని బీఆర్ఎస్ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు సరే, తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు.. రైతులు.. ఆర్టీసీ కార్మికులు.. యువత ఆత్మహత్య చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారా? అని ప్రశ్నించారు. 317 జీవో కారణంగా ఉపాధ్యాయులు చనిపోతే.. కనీసం పరామర్శకైనా ముఖ్యమంత్రి వెళ్లారా? అన్న బండి.. గరబీ కళ్యాణ అన్న యోజన కింద కేంద్రం పేదలకు ఇచ్చిన బియ్యాన్ని బీఆర్ఎస్ దొంగలు అమ్ముకున్నారన్నారు.
ప్రధానమంత్రి అవాజ్ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులను డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో దోచుకున్నట్లుగా ఆరోపించారు. రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్నట్లుగా బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు చెబుతున్నారని.. .ఒకవేళ అదే నిజమైతే.. దాన్ని నిరూపించాలన్నారు. ఎంపీ నామా 24 గంటల విద్యుత్ ను నిరూపిస్తే తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ సవాలు విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ ఆయన సతీమణి ఆస్తుల పెంపుపై బండి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి.. దీనికి గులాబీ నేతలు ఏమైనా కౌంటర్ ఇస్తారా? అన్నది చూడాలి.