బీసీలకు 34 సీట్లు పక్కానా ?
రాబోయే తెలంగాణా ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపోటములపైన అయినా బీసీల ప్రభావం కీలక పాత్ర పోషించబోతోందన్నది అర్ధమవుతోంది.
రాబోయే తెలంగాణా ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపోటములపైన అయినా బీసీల ప్రభావం కీలక పాత్ర పోషించబోతోందన్నది అర్ధమవుతోంది. అందుకనే మూడు ప్రధానపార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు బీసీలను మంచిచేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం కీలకనిర్ణయం తీసుకున్నది. అదేమిటంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోను రెండు అసెంబ్లీ సీట్లను బీసీలకు కచ్చితంగా కేటాయించాలని. బీసీల మద్దతులేనిదే అధికారంలోకి రావటం కష్టమని కాంగ్రెస్ అధిష్టానికి బాగా అర్ధమైంది.
అందుకనే పార్టీలోని తెలంగాణా బీసీ నేతలు ఇప్పటికే రెండు మీటింగులు పెట్టుకున్నారు. జనాభా దామాష ప్రకారం కనీసం 45 నియోజకవర్గాలను బీసీలకే కేటాయించాలని ఒక తీర్మానం చేసి అధిష్టానానికి పంపారు. ఎందుకంటే 70 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపోటములను ప్రభావితం చేసేంతగా బీసీల జనాభా ఉందని తీర్మానంలో చెప్పారు. తీర్మానంలో చెప్పింది నిజమే అయినప్పటికి అన్ని సీట్లను బీసీలకు కేటాయించటం సాధ్యమేనా అన్న చర్చ పార్టీలోనే జరిగింది.
అయితే దీనిపై విస్తృతస్ధాయిలో చర్చలు జరిపిన అధిష్టానం ఫైనల్ గా ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోను రెండు అసెంబ్లీలను బీసీలకు కేటాయించాలని స్పష్టంగా ఆదేశించింది. దీని ప్రకారం చూసుకుంటే 34 సీట్లు బీసీలకు గ్యారెంటీ అనే అనిపిస్తోంది. నిజంగానే 34 సీట్లను బీసీలకు కేటాయించినా పెద్ద ఫిగర్ అనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం 119 నియోజకవర్గాల్లో 31 సీట్లు రిజర్వుడు సీట్లే ఉన్నాయి. 19 నియోజకవర్గాలు ఎస్సీలకు, 12 నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వయ్యాయి.
119లో 31 రిజర్డుడు సీట్లుపోతే మిగిలే సీట్లు 88 మాత్రమే. వీటిల్లో 34 సీట్లు బీసీలకంటే ఇక మిగిలేవి 54 సీట్లు మాత్రమే. ఈ సీట్లలోనే రెడ్లు, కమ్మోరు, కాపులు, వెలమలు, క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్య సామాజికవర్గాలకు కేటాయించాలి. బీసీలతో పాటు తెలంగాణాలో రెడ్డి సామాజికవర్గం కూడా బాగా పవర్ ఫుల్లనే చెప్పాలి. ఏ పార్టీని తీసుకున్నా రెడ్ల ఆధిపత్యం కనిపిస్తుంది. ఇన్ని సామాజికవర్గాలున్నపుడు కేవలం బీసీలకు 34 సీట్లంటే చాలా ఎక్కువ కేటాయించబోతున్నారనే అనుకోవాలి. మరి టికెట్ల కేటాయింపుకు వచ్చేసరికి ఏమవుతుంది ? బీసీలు ఎటు మొగ్గుతారో చూడాలి.