ఆంధ్రాలో అంతే.. చంద్రబాబునూ వదలని పందెంరాయుళ్లు!

'అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ల కాదేదీ కవితకనర్హం' అన్నట్టు పందెం కాయడానికి ఏ అంశాన్ని ఆంధ్రాలో వదులకోవడం లేదు.

Update: 2023-09-14 16:30 GMT

'అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ల కాదేదీ కవితకనర్హం' అన్నట్టు పందెం కాయడానికి ఏ అంశాన్ని ఆంధ్రాలో వదులకోవడం లేదు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జగన్‌ ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు తరఫున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో, ఏపీ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు జగన్‌ ప్రభుత్వం కూడా చంద్రబాబు ఒక కేసులో బయటికొస్తే మరొక దానిలో అరెస్టు చేసేలా అనేక కేసులను ఆయనపై మోపింది. చిత్తూరు జిల్లా అంగళ్లులో పోలీసులు, వైసీపీ కార్యకర్తలపై దాడి చేయించారని ఒక కేసు, రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చారని మరో కేసు ఇలా అనేక కేసులతో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన రెండు బెయిల్‌ పిటిషన్లు సెప్టెంబర్‌ 18కి, 20కి వాయిదా పడ్డాయి. మరోదానిపై విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పందెంరాయుళ్లు చంద్రబాబు బెయిల్‌ పైనా భారీ ఎత్తున బెట్టింగులు కాస్తున్నారని సమాచారం. చంద్రబాబుకు ఫలానా కేసులో బెయిల్‌ వస్తుందా, రాదా? ఆయన జైలు నుంచి విడుదలవుతారా, లేదా? చంద్రబాబు ఎన్నాళ్లు జైలులో ఉండే అవకాశం ఉంది.. ఇలా అనేక అంశాలపై పందెంరాయుళ్లు పందేలు కాస్తున్నారని తెలుస్తోంది.

గతంలో ఉభయగోదావరి జిల్లాలు మరికొన్ని జిల్లాల్లో కోడి పందేల గురించి మాత్రమే మనకు తెలుసు. కానీ ఈ మధ్య ట్రెండ్‌ మార్చారు. సంక్రాంతిలో కోడి పందేలు ఉంటాయి కాబట్టి ఈలోపు పందేలకు అవకాశమున్న అన్ని అంశాలపై బెట్టింగులు భారీ ఎత్తున జరుగుతున్నాయట.

ఇటీవల ఐపీఎల్‌ జరిగినప్పుడు ఇలాగే ఎవరు గెలుస్తారు? ఎవరు కప్‌ కొడతారు? అంటూ మ్యాచ్‌ మ్యాచ్‌ కి పందేలు కాశారు. ఆ తర్వాత పొలిటికల్‌ పందేలు షురూ అయ్యాయి. జనసేన–టీడీపీ పొత్తు ఉంటుందా, ఉండదా? బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా? లేదా? జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? లేదా ఏకపక్షంగా మద్దతు ఇస్తుందా? ఇలా పందేలు జరిగాయి.

ఇప్పటికే గోదావరి జిల్లాల్లో టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? ఎన్ని గెలుస్తుంది? అలాగే జనసేన ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది? ఎన్ని గెలుస్తుంది? వైసీపీకి ఈసారి గోదావరి జిల్లాల్లో వచ్చే సీట్లెన్ని వంటి అంశాలపై భారీ ఎత్తున పందేలు కాస్తున్నారని తెలుస్తోంది.

అదేవిధంగా ముందస్తు ఎన్నికలు ఉంటాయా? ఉండవా? ఆయా పార్టీల తరపున ఫలానా వ్యక్తికి సీటు లభిస్తుందా? లభించదా? ఫలానా పార్టీ అభ్యర్థి ఈసారి గెలుస్తాడా? ఓడిపోతాడా?.. ఇలా కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు కాదేదీ పందేలకు అనర్హం అన్నట్టు ఈ పందేలు సాగుతున్నాయని అంటున్నారు.

అదేవిధంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈసారి కూడా భీమవరం నుంచే పోటీ చేస్తారని భారీ ఎత్తున పందేలు జరుగుతున్నట్టు సమాచారం. కొంతమంది పవన్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని పందేలు కాస్తున్నట్టు చెబుతున్నారు. పవన్‌ గెలుపు ఓటములపైనా పెద్ద ఎత్తున అడ్వాన్స్‌డ్‌ బెట్టింగులు కాస్తున్నట్టు పేర్కొంటున్నారు.

అలాగే పవన్‌ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేయరని.. ఈసారి రాయలసీమలోని తిరుపతి నుంచి బరిలోకి దిగుతారని పందేలు కాసేవారి శాతం ఎక్కువగానే ఉందని ప్రచారం సాగుతోంది.

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని కొందరు, అధికారంలోకి రాదని కొందరు భారీ ఎత్తున పందేలు కాస్తున్నారని అంటున్నారు. కోడి పందేలతో పాపులరైన గోదావరి జిల్లాలు ఇప్పుడు చంద్రబాబుకు బెయిల్‌ వస్తుందా? రాదా అంటూ పొలిటికల్‌ పందేలతోనూ పాపులర్‌ అవుతుండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

సంక్రాంతి వరకు కోడి పందేలు లేవు. ఐపీఎల్‌ క్రికెట్‌ టోర్నీ కూడా ముగిసింది. వచ్చే జనవరి నాటికి సంక్రాంతి, ఏప్రిల్‌/మేలో ఐపీఎల్‌ ఉంటుంది. అయితే ఈలోపుగానే పందెం రాయుళ్లు వెనక్కి తగ్గకుండా చంద్రబాబు బెయిల్‌ పైనా పొలిటికల్‌ పందేలు కాస్తుండటం విశేషం.

Tags:    

Similar News