'రాజే'స్థాన్ కాదు.. తొలిసారి గెలిచి సీఎం.. హ్యాట్రిక్ సర్ ప్రైజ్
స్పస్పెన్స్ వీడింది.. మరో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తేలింది.. అందరూ ఊహించినట్లే అది ఇకమీదట ''రాజే''స్థాన్ కాదని తేలిపోయింది
స్పస్పెన్స్ వీడింది.. మరో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తేలింది.. అందరూ ఊహించినట్లే అది ఇకమీదట ''రాజే''స్థాన్ కాదని తేలిపోయింది. తెరపైకి కొత్త నాయకుడు వచ్చాడు. సంచలనాత్మక రీతిలో బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. రాజుల పట్టునుంచి రాజస్థాన్ ను తప్పించి బ్రాహ్మణ నాయకుడి చేతిలో పెట్టింది. ఛత్తీస్ గఢ్ లో ఆదివాసీని అందలమెక్కించి.. మధ్యప్రదేశ్ లో బీసీకి పట్టం కట్టిన బీజేపీ.. రాజస్థాన్ లో మాత్రం అగ్రవర్ణ నాయకుడిని రాష్ట్రానికి అధిపతిగా నియమించింది.
తొలిసారి ఎమ్మెల్యేనే
రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే దశాబ్దాల రాజకీయ అనుభవం ఉండాలి. కనీసం మూడు ఎన్నికల్లో గెలిచి ఉండాలి. లేదంటే ఎంపీ అయి కేంద్రంలో మంత్రిగా పనిచేసి ఉండాలి. ఇవేవీ లేకుండానే భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిని చేసింది బీజేపీ. ఈయన తొలిసారి గెలిచిన నాయకుడు కావడం గమనార్హం. ఈనెల 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. అప్పటినుంచి రాజస్థాన్ సీఎం ఎంపికపై అనేక తర్జనభర్జనలు సాగుతున్న సంగతి తెలిసిందే. తమకు పదవి కావాల్సిందేనంటూ మాజీ సీఎం వసుంధరా రాజే, కుమారుడు దుష్యంత్ తో కలిసి ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిశారు. కేంద్ర మంత్రులు పలువురు, ఒలింపిక్ పతక విజేత రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ కూడా సీఎం రేసులో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. అయితే, వీరెవరికీ కాకుండా భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు.
ఇద్దరు డిప్యూటీలు..
రాజస్థాన్ రాజధాని జైపూర్ లో మంగళవారం జరిగిన బీజేపీ శాసన సభా పక్ష నేత ఎన్నికలో భజన్ లాల్ ను ఎన్నుకున్నారు. ఈయన నియోజకవర్గం సంగనేర్. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోలాగే రాజస్థాన్ లోనూ ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించనుంది. దియా కుమారి, ప్రేమ్ చంద్ భైరవను ఉప ముఖ్యమంత్రులుగా ప్రకటించింది. దియా కుమారి పేరు కూడా సీఎం పదవికి వినిపించిన సంగతి తెలిసిందే.
హ్యాట్రిక్ సర్ ప్రైజ్
బీజేపీ తాజా నిర్ణయంపై అందరూ ఆశ్చర్యపోతుండగా.. దీనిని హ్యాట్రిక్ సర్ ప్రైజ్ గా అభివర్ణిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లో విష్ణుదేవ్ సాయి, మధ్యప్రదేశ్ లో మహేంద్ర యాదవ్ లను సీఎంలుగా చేసిన ఉదాహరణలను ప్రస్తావిస్తూ ఈ మేరకు పేర్కొంటున్నారు. మరోవైపు పెద్ద నాయకులకు అధికారం ఇచ్చి.. వారి వర్గాన్ని పెంచి పోషించే కల్చర్ కు చెక్ పెడుతూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ద్వయం మూడు రాష్ట్రాల సీఎంలను ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. మధ్యప్రదేశ్ లోలాగే రాజస్థాన్ లోనూ సీఎం ప్రకటన సమయంలో కీలక నాయకురాలు వసుంధరా రాజేను భాగస్వామిని చేశారు.