ఏపీపై బీజేపీ నయా ప్లాన్.. ఒకేసారి ఏడుగురు ఎంపీలపై గురి?

దక్షిణాది రాష్ట్రాల్లో సొంతంగా ఎదగాలని భావిస్తోన్న భారతీయ జనతా పార్టీ.. ఏపీపై స్పెషల్ ఫోకస్ చేసిందని ప్రచారం జరుగుతోంది.

Update: 2025-02-03 02:30 GMT

దక్షిణాది రాష్ట్రాల్లో సొంతంగా ఎదగాలని భావిస్తోన్న భారతీయ జనతా పార్టీ.. ఏపీపై స్పెషల్ ఫోకస్ చేసిందని ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీతో కలిసిన బీజేపీ.. ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీపై స్కెచ్ వేసిందనే టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజుల నుంచి ఈ దిశగా అడుగులు వేస్తున్న కమలనాథులు.. తమ వ్యూహాన్ని అమలు చేసే సమయం ఆసన్నమైందని సంకేతాలిస్తున్నట్లు చెబుతున్నారు. రాజ్యసభలో సంపూర్ణ మెజార్టీ దిశగా అడుగులు వేస్తోన్న బీజేపీ.. ఏపీలో వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులకు కమలం కండువాలు కప్పి, ఆ పార్టీ రాజ్యసభా పక్షాన్ని విలీనం చేసుకోవాలని వ్యూహానికి పదును పెడుతున్నట్లు చెబుతున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఐదేళ్ల వ్యవధిలో మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులను గెలిపించుకుంది. అప్పట్లో ఆ పార్టీకి సంపూర్ణ బలం ఉండటంతో టీడీపీ రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని స్థితికి వచ్చింది. అంతేకాకుండా 2019లో అధికారం కోల్పోయిన టీడీపీ.. తన రాజ్యసభ సభ్యులను కాపాడుకోలేకపోయింది. అప్పటి రాజకీయ పరిణామాల వల్ల టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు కమలం తీర్థం పుచ్చుకుని, బీజేపీలో టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనం చేశారు. కట్ చేస్తే ఐదేళ్లు తిరిగే సరికి రెండు పార్టీలు ఏకమయ్యాయి. టీడీపీకి హ్యాండిచ్చిన నేతలు ఇప్పటికీ బీజేపీలో కొనసాగుతుండగా, నలుగురిలో ఇద్దరు మళ్లీ ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అయితే గతంలో టీడీపీపై ప్రయోగించిన ఈ అస్త్రాన్ని కమలనాథులు తాజాగా వైసీపీపై ప్రయోగించాలని పథకం రచిస్తున్నారనే సమాచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

గతంలో ఏ విధంగా అయితే టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనం చేసుకున్నామో.. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ రాజ్యసభా పక్షాన్ని లాగేయాలని కాషాయ నేతలు ఆలోచనగా చెబుతున్నారు. ఈ దిశగా ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ.. తన రాజ్యసభ సభ్యులను నిలుపుకోవడంలో అష్టకష్టాలు పడుతోంది. ఫలితాలు వచ్చిన కొద్ది నెలల్లోనే ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయగా, తాజాగా ఆ పార్టీ రాజ్యసభా పక్ష నేత విజయసాయిరెడ్డి కూడా తన సభ్యత్వాన్ని వదులుకున్నారు. అయితే ఇలా ఖాళీ అయ్యే స్థానాలు టీడీపీ ఖాతాలోకి వెళుతుండటంపై కమలం పార్టీలో అంతర్గత చర్చకు దారితీస్తోందని అంటున్నారు. ప్రస్తుతానికి మూడు ఖాళీలకు ఉప ఎన్నికల జరిగితే ముందస్తు ఒప్పందం ప్రకారం బీజేపీకి ఒక స్థానం కేటాయించారు. అయితే భవిష్యత్లో జరిగే ఖాళీల్లో జనసేనకు కూడా అవకాశం ఇవ్వాల్సివున్నందున బీజేపీ తన ప్లాన్ మార్చిందని చెబుతున్నారు.

వైసీపీని వీడేందు కొందరు రాజ్యసభ సభ్యులు సిద్ధంగా ఉన్నామని కేంద్రంలోని బీజేపీ నేతలకు చెబుతున్నారు. అయితే వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ఇబ్బంది లేకపోయినా, కూటమి ఒప్పందం వల్ల వారికి మళ్లీ రాజ్యసభ అవకాశం ఇస్తామని హామీ ఇవ్వలేకపోతోందట. ఈ పరిస్థితుల్లో వైసీపీ నుంచి వస్తామని చెబుతున్న వారితో అసలు రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకోవడమే బెటర్ అనే ఆలోచన చేస్తోందని అంటున్నారు. ప్రస్తుతం వైసీపీకి ఏడుగురు రాజ్యసభా సభ్యులు ఉన్నారు. వీరిలో రిలయన్స్ రికమెండేషన్ తో ఎన్నికైన పరిమళ్ నత్వానీని సాంకేతికంగా చెప్పుకోవాలి తప్ప, ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదనే వ్యాఖ్యానాలే వినిపిస్తున్నాయి. ఇక మిగిలిన ఆరుగురిలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితులే ఎక్కువ. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డితోపాటు ఆయన వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డి, పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, సీనియర్ నేత పిల్లి సుభాశ్ చంద్రబోస్, మేడా రఘురామిరెడ్డి, గొల్ల బాబూరావు వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వీరిలో గొల్ల బాబూరావు, మేడా రఘురామిరెడ్డి గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని ఎప్పటినుంచో ప్రాచారం జరుగుతోంది. అదే ప్రచారాన్ని ఎదురొన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఆ ప్రచారంలో వాస్తవం లేదని ఖండించారు. కానీ, తాము ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు అయోధ్యరామిరెడ్డి చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఇక మిగిలిన ఇద్దరూ కూడా బీజేపీకి టచ్లోకి వెళితే మాజీ సీఎం జగన్ కు పెద్ద దెబ్బే అంటున్నారు. అయితే వైవీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీలోనే కొనసాగుతారని చెబుతున్నారు.

నిరంజన్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఆయనపై బీజేపీ గట్టిగా ఫోకస్ చేసిందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి గతంలో టీడీపీకి అప్పటి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ను ఒక్కరినే వదిలేసినట్లు.. ఇప్పుడు వైవీని వదిలేసి మిగిలిన ఎంపీలు అందరినీ తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్యసభా పక్ష నేత కూడా లేకపోవడం కూడా బీజేపీ ప్రయత్నాలకు కలిసివస్తోందని చెబుతున్నారు. చర్చలు ఫలించి బీజేపీలో చేరేందుకు ఎంపీలు అంగీకరిస్తే కొద్ది రోజుల్లో వైసీపీకి భారీ షాక్ తగలడం ఖాయమంటున్నారు. ఏదిఏమైనా బీజేపీ వ్యూహం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తావిస్తోంది.

Tags:    

Similar News