భట్టి పంచ్ విన్న తర్వాత.. కేటీఆర్ నోట పులి మాట రాదేమో?
దీనిపై తాజాగా భట్టి విక్రమార్క్ స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు వ్యంగ్య రీతిలో ఆయన విసిరిన పంచ్ మామూలుగా లేదన్న మాట వినిపిస్తోంది.
గొప్పగా చెప్పుకోవటానికి బడాయి మాటలు మామూలే. ఇలాంటి విషయాల్లో రాజకీయ నాయకులు మరింత చురుగ్గా ఉంటారు. అందునా.. ఎన్నికల టైంలో వారి నోటి నుంచి వచ్చే మాటలు మామూలుగా ఉండవు. కీలకమైన ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన వేళ.. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లుగా ప్రచారం జరుగుతున్న వేళ.. మంత్రి కేటీఆర్ నోటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పతనం గురించి చెప్పుకోవటం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ మధ్యన ఆయన మాటల్లో ముఖ్యమంత్రిని ఉద్దేశించి 'పులి'గా అభివర్ణిస్తున్నారు.
పులి బయటకు వస్తే.. రాజకీయ ప్రత్యర్థులు పరార్ అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. దీనిపై తాజాగా భట్టి విక్రమార్క్ స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు వ్యంగ్య రీతిలో ఆయన విసిరిన పంచ్ మామూలుగా లేదన్న మాట వినిపిస్తోంది. 'పులి వస్తది' అంటూ కేటీఆర్ ప్రగల్బాలు పలుకుతున్నారని.. ప్రజలను ఆ పులి బారి నుంచి రక్షించేందుకు దాన్ని బంధించి బోన్ లో వేస్తామని వ్యాఖ్యానించారు.
భట్టి విసిరిన పంచ్ దెబ్బకు కేటీఆర్ నోటి నుంచి పులి ప్రస్తావన తెచ్చే సాహసం చేయరంటున్నారు. అయినా.. తమ నాయకుడి గొప్పతనాన్ని కీర్తించేందుకు పులి.. సింహం.. ఏనుగు లాంటి జంతువుల పేర్లు ప్రస్తావించే కంటే.. ఇంకేం పోలికలు లేవా? అన్నది ప్రశ్న. మంచి మాటకారి అయిన కేటీఆర్ సైతం మాటలురాని వారు మాట్లాడే రీతిలో.. ఇలా జంతువులతో పోలికలు పోల్చటంలో అర్థం లేదు.
ఇక.. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నట్లుగా రైతులకు రుణమాఫీ నిధులు వారి ఖాతాల్లో జమ కాలేదని మండిపడటం గమనార్హం. అంతేకాదు.. సెల్ ఫోన్ కు డబ్బులు పడినట్లుగా మెసేజ్ లు వచ్చినప్పటికీ.. వాస్తవంలో మాత్రం జమ కాలేదన్న భట్టి.. అందుకు తగ్గట్లే కొన్ని ఉదాహరణలు చూపించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే పెద్ద మోసగాడు లేడన్న భట్టి..
రైతుల రుణమాఫీ వ్యవహారాన్ని ప్రస్తావించటం ప్రభుత్వాన్ని ఇరుకున పడేసినట్లేనని చెబుతున్నారు. ఇప్పటికే రుణమాఫీపై రైతులు అగ్రహంగా ఉన్న వేళ.. రైతుల ఖాతాలో పడ్డాయన్న ప్రకటనల తర్వాత కూడా కొందరికి పడకపోవటం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందంటున్నారు. భట్టి చేసిన ఆరోపణలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.