బ్రేకింగ్... టీటీడీ ఛైర్మన్‌ గా భూమన కరుణాకర రెడ్డి!

గతకొన్ని రోజులుగా రకరకాల పేర్లు తెరపైకి వస్తున్న టీడీపీ ఛైర్మన్ పోస్ట్ పై క్లారిటీ వచ్చింది

Update: 2023-08-05 11:22 GMT

గతకొన్ని రోజులుగా రకరకాల పేర్లు తెరపైకి వస్తున్న టీడీపీ ఛైర్మన్ పోస్ట్ పై క్లారిటీ వచ్చింది. ఈ సందర్భంగా టీటీడీ బోర్డ్ కొత్త ఛైర్మన్ పేరును తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి నియమితులయ్యారు.

అవును... తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ గా భూమన కరుణాకరరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఛైర్మన్‌ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈయనను నియమించారు. భూమన కరుణాకర్‌ రెడ్డి రెండేళ్ల పాటు టీటీడీ ఛైర్మన్‌ గా వ్యవహరించనున్నారు. టీటీడీ చైర్మన్ గా త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారు.

కాగా భూమన చేతికి టీటీడీ పగ్గాలు రావడం ఇది రెండోసారి. గతంలో 2006-2008 మధ్య కాలంలో ఒకసారి టీటీడీ ఛైర్మన్‌ గా పనిచేశారు భూమన. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా, టీటీడీ మెంబర్‌ గా కూడా ఉన్నారు భూమన! నాడు వైఎస్‌ హయాంలోనూ, ఇప్పుడు జగన్‌ హయాంలోనూ భూమన టీటీడీ పగ్గాలు స్వీకరించడం విశేషం.

వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా పేరున్న భూమన కరుణాకర్ రెడ్డి.. 2019 నాటి ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. అయితే రాబోయే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని భూమన ఇప్పటికే స్పష్టం చేశారు. తన స్థానంలో తన కుమారుడుకి తిరుపతి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని కోరనున్నారని తెలుస్తోంది.

కాగా... వైఎస్సార్‌ హయాంలో సుమారు రెండేళ్ల పాటు టీటీడీ ఛైర్మన్‌ గా భూమన పనిచేసిన సమయంలోనే "దళిత గోవిందం" వంటి టీటీడీ పథకాలు అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో 2019 లో వైసీపీ అధికారంలోకి రాగానే టీటీడీ ఛైర్మన్ గా భూమన పేరే మొదటగా వినిపించింది.

అయితే కొన్ని సమీకరణాల నేపథ్యంలో ఆ పదవి వైవీ సుబ్బారెడ్డికి దక్కింది. ఇప్పుడు సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియడంతో మరోసారి భూమన కరుణాకర్ రెడ్డిని ఆ పదవి వరించింది! ఈ సందర్భంగా... తనను టీటీడీ ఛైర్మన్‌ గా నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కరుణాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Full View
Tags:    

Similar News