భారీ యుద్దానికి బ్రేకులు వేసిన బైడెన్!
ఇంతకూ విషయం ఏమంటే.. ఇరాన్ మద్దతు ఉన్న దళాలపై భారీగా దాడి చేయాలని పెంటగాన్ ప్లాన్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బ్రేకులు వేసినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి.
అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి బయటకు వచ్చే కొన్ని వార్తల్లో నిజం ఎంత? అన్న దానిపై బోలెడన్ని సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ముఖ్యంగా.. అమెరికా మీడియా నుంచి వచ్చే వార్తల్లో కొన్ని పక్కాగా ప్రణాళికలో భాగంగా ప్రచారానికి తీసుకొస్తుంటారు. తాజాగా వెలుగు చూసిన వార్తను చూసినప్పుడు ఇందులో నిజమెంత? అన్నది ప్రశ్నగా మారుతుంది. మరోవైపు.. అమెరికా అధ్యక్షుడ్ని పెద్ద హీరోగా ఫోకస్ చేయటం చూసినప్పుడు.. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల సందర్భాన్ని చూసినప్పుడు ఈ తరహా అనుమానాలకు ప్రాధాన్యం ఇవ్వటం తప్పుగా అనిపించదు.
ఇంతకూ విషయం ఏమంటే.. ఇరాన్ మద్దతు ఉన్న దళాలపై భారీగా దాడి చేయాలని పెంటగాన్ ప్లాన్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బ్రేకులు వేసినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. ఇరాన్ మద్దతు చెలరేగిపోతున్న సాయుధ గ్రూపులపై భారీగా బాంబింగ్ చేయాలని చెబితే.. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అందుకు అడ్డు పెట్టినట్లుగా న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నారు. మధ్యప్రాశ్చ్యంలో యూఎస్ దళాలపై ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ సంస్థలు దాడులు చేస్తున్నాయి.
సిరియా.. ఇరాక్ లలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకొని దాడులు తీవ్రమైన నేపథ్యంలో సంస్థలను లక్ష్యంగా చేసుకొని భారీ బాంబింగ్ చేయాలని పెంటగాన్ ప్రతిపాదించింది. అయితే.. ఇలా చేయటం వల్ల ఘర్షణలు మరింత ముదిరిపోయి భారీ సంక్షోభానికి దారి తీస్తుందన్న అభిప్రాయాన్ని బైడెన్ వ్యక్తం చేసినట్లుగా పేర్కొన్నారు. తన నిర్ణయంతో అమెరికా సైనికుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతగా పేర్కొన్నట్లు అయ్యింది.
ఒకవేళ.. ఇరాన్ మద్దతు ఇచ్చే ఉగ్రసంస్థలపై భారీఎత్తున దాడులకు దిగితే.. అది అక్కడితో ఆగకుండా.. మరో యుద్దానికి తెర తీసినట్లు అయ్యేదని.. ఒకవిధంగాబైడెన్ తీసుకున్న నిర్ణయం మరో మహా యుద్ధానికి బ్రేకులు వేసినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే ఓపక్క రష్యా - ఉక్రెయిన్, మరోపక్క ఇజ్రాయెల్ - గాజా మధ్య జరుగుతున్న యుద్ధాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్రపంచానికి బైడెన్ తన నిర్ణయంతో కొత్త తలనొప్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెప్పక తప్పదు.