హుండీలో పడిన ఫోన్ దేవుడికి కానుకే అంటున్న అధికారులు
దేవుడికి కానుకగా డబ్బు, నగలు సమర్పించుకుంటారు. కొంతమంది తమకు ఉన్న భూమిని దేవుడి పేరిట రాస్తుంటారు.
దేవుడికి కానుకగా డబ్బు, నగలు సమర్పించుకుంటారు. కొంతమంది తమకు ఉన్న భూమిని దేవుడి పేరిట రాస్తుంటారు. ఇలా ఎవరు ఏది చేసినా ముక్తి కోసం భక్తితో చేసేదే.. కానీ, తమిళనాడులోని ఓ ఉద్యోగి పొరపాటున ఖరీదైన సెల్ ఫోనును హుండీలో వేయగా, అది దేవుడి కానుకగా జమ చేశారు ఆలయ అధికారులు. బాబ్బాబు పొరపాటున ఫోన్ జారిపోయింది, తన ఫోన్ తనకు రిటన్ ఇవ్వమని ఆ ఉద్యోగి కాళ్లావేళ్లా బతిమిలాడినా.. పొరపాటైనా, గ్రహపాటైనా హుండీలో ఏది పడినా అది కానుకగానే లెక్కిస్తామని, తిరిగి రిటన్ ఇవ్వడం కుదరదంటే కుదరదని ఖరాకండీగా చెప్పేస్తున్నారు. దీంతో చేసేది లేక ఆ ఉద్యోగి రాష్ట్ర మంత్రికి సమస్య తెలియజేసినా ఆయన కూడా ఏం చేయలేనని నిబంధనలు చూపి చేతులేత్తేశారట. ఈ విచిత్ర సంఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటు చేసుకుంది.
చెన్నై అంబత్తూర్ వినాయకపురానికి చెందిన దినేశ్ చెన్నై మెట్రోపాలిటన్ డెవెలప్మెంట్ అథారిటీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కుటుంబంలో సమస్యలు ఉన్నాయని, దేవుడి దర్శనానికి వెళ్తే అవి పరిష్కారమవుతాయనే ఆలోచనతో ఈ ఏడాది అక్టోబరులో చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూరులోని సుప్రసిద్ధ కందస్వామి మురుగన్ ఆలయానికి వెళ్లారు. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న దినేశ్ పరధ్యానంతో చేతిలో ఉన్న ఐఫోనును హుండీలో వేసేశాడు. దేవుడికి కానుకలు సమర్పించుకోవాలనే ఆలోచనతో చేతిలో ఉన్న ముడుపుతో సహా ఫోనును జారవిడిచాడు. వెంటనే తేరుకుని పొరపాటున హుండీలో ఫోను పడిపోయిందని, దాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆలయ అధికారులను కోరాడు దినేశ్. అయితే హుండీలో వేసినవన్నీ దేవుడికే చెందుతాయని, ఫోన్ తిరిగివ్వడం కుదరదని ఆలయ అధికారులు చెప్పడంతో కంగుతిన్నాడు.
చాలా విలువైన ఫోన్ కావడంతో ఎలాగైనా తన ఫోన్ను తిరిగి తీసుకోవాలనే ఆలోచనతో రాష్ట్రస్థాయి అధికారులను కలిసి జరిగిన విషయాన్ని చెప్పాడు. వారు కూడా నిబంధనలు ప్రకారం ఫోను దేవుడికే చెందుతుందని చెప్పడంతో రాష్ట్ర దేవాదాయ మంత్రి శేఖర్ బాబును కలిసి ఫిర్యాదు చేశాడు. ఆయన నోట కూడా అధికారుల నుంచి వచ్చిన సమాధానమే రావడంతో ఉసూరుమంటున్నాడు దినేశ్.