'పుష్ప-2' ఘటనపై వీడియో విడుదల... బౌన్సర్లకు సీపీ మాస్ వార్నింగ్!

"పుష్ప-2" సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన వ్యవహారం ఎంత సంచలనంగా మారిందనేది తెలిసిన విషయమే

Update: 2024-12-22 13:01 GMT

"పుష్ప-2" సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన వ్యవహారం ఎంత సంచలనంగా మారిందనేది తెలిసిన విషయమే. దీనిపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగ్గా.. అనంతరం మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్జున్.. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని అన్నారు.

మరోపక్క కాంగ్రెస్ నేతలు, మంత్రులు, కమ్యునిస్టు నేతలు, ఓయూ జేఏసీ నాయకులు వరుసగా అల్లు అర్జున్ వ్యవహార శైలితో పాటు.. అలాంటి సినిమాలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవ్వడంపైనా విమర్శలు గుప్పించారు. ఈ సమయంలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను వివరించారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.

అవును... సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధిచి హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ ఓ వీడియోను విడుదల చేశారు. ఇదే సమయంలో.. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీవీ ఆనంద్ తో పాటు చిక్కడపల్లి ఏసీపీ రమేష్, సీఐ రాజు నాయక్ లు జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీవీ ఆనంద్... సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని.. న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు సీపీ సమాధానాలు చెప్పారు.

ఇదే సమయంలో.. ప్రస్తుతం కేసుపై దర్యాప్తు జరుగుతుందని, కేసు కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేశారు. ఈ సమయంలో... నాడు రాత్రి సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను సీవీ ఆనంద్ విడుదల చేశారు. ఈ వీడియోలో అత్యంత కీలకమైన మెజారిటీ విషయాలు క్యాప్చర్ అయినట్లు తెలుస్తోందని అంటున్నారు.

ఈ సందర్భంగా... బౌన్సర్లకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా... బౌన్సర్లు ఇకపై పోలీసులను ముట్టుకున్నా, మిస్ బిహేవ్ చేసినా వదిలిపేట్టే ప్రసక్తి లేదని.. పబ్లిక్ ను ఎక్కడైనా తోసినట్లు కనిపిస్తే తాటతీస్తామని.. దీనిపై పూర్తి బాధ్యత సప్లై ఏజన్సీలదేనని.. బౌన్సర్ల తీరుపై సెలబ్రెటీలూ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

Tags:    

Similar News