'అతడు.. ఆమె అయ్యాడు..' బిగ్ బాస్ తో ఆమెకు దొరికాడు
ఇటీవలి కాలంలో ఇలాంటి కథనాలు మీడియాలో తరచూ వస్తున్నాయి.
కాలంతో పాటే వ్యక్తుల ఆలోచనా ధోరణులు మారుతున్నాయి. ఆహార అలవాట్లలో, వేష-భాషల్లోనే కాదు శరీరం విషయంలోనూ కొందరిలో తీవ్ర ఆలోచనలు వస్తునాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి కథనాలు మీడియాలో తరచూ వస్తున్నాయి. ఇద్దరు యువతులు లేదా ఇద్దరు పురుషులు వివాహం చేసుకోవడం, యువతిగా మారిన యువకుడు.. మహిళగా మారిన పురుషుడు.. హిజ్రాగా మారిన యువతి/యువకుడు, హిజ్రాను పెళ్లాడిన.. వంటి వార్తలు మీడియాలో కనిపిస్తున్నాయి. ఇక కొందరు ఇంటి నుంచి వెళ్లిపోయి థర్డ్ జెండర్ గా మారిన వైనమూ చూస్తున్నాం. ఇలాంటిదే కర్ణాటకలో ఓ ఉదంతం జరిగింది.
చేయడానికి పని ఉంది.. పెళ్లయింది.. ఇద్దరు పిల్లల తండ్రి కూడా అయ్యాడు.. కానీ, ఏం జరిగిందో ఏమో అకస్మాత్తుగా ఇంటినుంచి మాయమయ్యాడు. కేవలం రెండేళ్లు మాత్రమే సంసారం చేసిన అతడు ఆపై అప్పులంటూ ఇళ్లు విడిచిపెట్టి వెళ్లాడు. ఆ తర్వాత ఆరేళ్ల పాటు కనిపించలేదు. తీరా చూస్తే అతడు థర్డ్ జెండర్ గా మారాడు. కర్ణాటకలోని రామనగరలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడ చర్చనీయాంశం అవుతోంది. స్థానికుడైన లక్ష్మణరావు చికెన్ షాప్ లో పనిచేసేవాడు. 2015లో అతడు ఓ యువతిని వివాహం చేసుకోగా.. 2017 నాటికి ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. అయితే, రెండోవాడు నెలల శిశువుగా ఉన్నప్పుడే లక్ష్మణరావు ఇల్లొదిలి పోయాడు. ఎంత వెదికినా కనిపించకపోవడంతో అతడి భార్య ఐజూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు భర్త ఆచూకీ లేక పుట్టింటికి వెళ్లిపోయింది.
బిగ్ బాస్ లో బండారం బట్టబయలు..
ఆరేళ్లుగా వెదుకుతున్నప్పటికీ లక్ష్మణరావు జాడ లేకపోవడంతో అతడి భార్య నిరాశలో కూరుకుంది. అయితే, కొద్ది రోజుల కిందట కన్నడ బిగ్ బాస్ షో వీడియోలు చూస్తుండగా ఓ సీన్ లోని వ్యక్తిని చూసి అనుమానం కలిగింది. అతడు లక్ష్మణరావేనని భావించి.. మళ్లీమళ్లీ ఆ వీడియోలను చూసి నిర్ధారించుకుంది. అయితే, లక్ష్మణరావు అప్పటికే హిజ్రాగా మారిపోయాడు. తన భర్త పోలికలతో ఓ వ్యక్తిని చూసినట్లు ఐజూరు పోలీసులకు చెప్పింది. కాగా, ఇక్కడ మరో మలుపు కూడా ఉంది.
కన్నడ బిగ్ బాస్ లో ‘నీతు వనజాక్షి’ అనే హిజ్రా కూడా పాల్గొంది. ఆమె పోటీ నుంచి బయటకు వచ్చాక మైసూరులో థర్డ్ జెండర్ సముదాయం స్వాగతం పలికింది. ఇక మరో హిజ్రా రష్మిక తీసిన ఇన్ స్టా రీల్స్‌లోనూ లక్ష్మణ్ కనిపించాడు. వీటన్నిటితో ఐజూరు పోలీసుల వద్దకు వెళ్లిన లక్ష్మణరావు భార్య.. ఏమైనా చేయాలని కోరింది. పోలీసులు రష్మికను సంప్రదించి, వీడియోలో కనిపించిన వ్యక్తి చిరునామా తెలుసుకున్నారు.
లక్ష్మణరావు కాదు విజయలక్ష్మి
ఇంటి నుంచి వెళ్లిపోయిన లక్ష్మణరావు హిజ్రాగా మారి తన పేరును విజయలక్ష్మిగా మార్చుకున్నాడు. అయితే రష్మిక తెలిపిన వివరాలతో అతడి చిరునామా, ఇతర వివరాలు తెలుసుకుని ఐజూరు పోలీసులు పట్టుకున్నారు. తాను విజయలక్ష్మిని అంటూ వాదించాడు. కానీ, పుట్టు మచ్చలు, ఇతర గుర్తులను అతడి భార్య గుర్తు పట్టింది. దీంతో అతడు నిజయం ఒప్పుకొన్నాడు. తాను లింగ మార్పిడి చేయించుకున్నానని అంగీకరించాడు. ఈ మాటలు వినడంతోనే భార్య మూర్ఛపోయింది. కాగా, చక్కటి కుటుంబాన్ని, భార్యాబిడ్డలను వదిలి ఎలా వెళ్లావని.. లక్ష్మణరావును ప్రశ్నించగా హిజ్రా జీవితమే బాగుందని చెప్పడం గమనార్హం.