బీహార్ లో రైలు ప్రమాదం... ప్రయాణికుల హాహాకారాలు!
ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు స్పందిస్తూ... బుధవారం రాత్రి 9.35 గంటలకు బక్సర్ సమీపంలోని రఘునాథ్ పూర్ స్టేషన్ కు సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.
బీహార్ రాష్ట్రంలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బీహార్ లోని బక్సర్ జిల్లాలోని రఘునాథ్ స్టేషన్ సమీపంలో బుధవారం కామాఖ్య వెళ్లే నార్త్ - ఈస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ఐదు కోచ్ లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందగా.. సుమారు 70 మంది గాయపడ్డారని, వారిలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది.
అవును... బుధవారం రాత్రి నార్త్ - ఈస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు బీహార్ లో ప్రమాదానికి గురైంది. సుమారు ఐదు కోచ్ లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు స్పందిస్తూ... బుధవారం రాత్రి 9.35 గంటలకు బక్సర్ సమీపంలోని రఘునాథ్ పూర్ స్టేషన్ కు సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.
రైలు ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో హాహాకారాలు చేశారని తెలుస్తుంది. ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందగా... మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం!
ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే... బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు. క్షతగాత్రులకు అవసరమైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని, సంబంధిత అధికారులను వీలైనంత త్వరగా ఘటనాస్థలికి పంపాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో... రైల్వే, ఇతర అధికారులతో పాటు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి అశ్విని చౌబే తెలిపారు.
ఇదే క్రమంలో... ప్రస్తుతం కార్మికులంతా రెస్క్యూ ఆపరేషన్ లో నిమగ్నమై ఉన్నారని తెలిపిన చాబే... వైద్య బృందాలను పంపించినట్లు తెలిపారు. మరోపక్క ఎమర్జెన్సీ కాంటాక్ట్ కోసం ఉత్తర రైల్వే హెల్ప్ లైన్ ను షేర్ చేసింది. హెల్ప్ లైన్ నంబర్ పాట్నా: 9771449971, దనపూర్: 8905697493, ఆరా: 8306182542, కమర్షియల్ కంట్రోల్: 7759070004.
రెండు రైళ్లు రద్దు, పలురైళ్లు దారి మళ్లింపు:
బుధవారం నాటి ఘటనతో భారతీయ రైల్వే రెండు రైళ్లను రద్దు చేయగా, పలురైళ్లను దారి మళ్లించింది. ఇందులో భాగంగా... తూర్పు మధ్య రైల్వే జోన్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. కాశీ పాట్నా జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ (15125), పాట్నా కాశీ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ (15126) రైళ్లను అధికారులు రద్దు చేసినట్లు తెలుస్తుంది.
పూణే-దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (12149), పాట్లీపుత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (12141), దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్ ప్రెస్ (12424), విక్రమశిలా ఎక్స్ ప్రెస్ (12368), కామాఖ్య ఎక్స్ ప్రెస్ (15623), గువాహటి - రాజేంద్ర నగర్ టెర్మినల్ తేజస్ రాజధాని ఎక్స్ ప్రెస్ (12310), భాగల్పూర్ గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ (22406) మొదలైన వాటిని రద్దుచేసినట్లు సమాచారం.