బిగ్ బ్రేకింగ్: టీమిండియా లెజెండరీ క్రికెటర్ కన్నుమూత!
భారత క్రికెట్ దిగ్గజం, టీం ఇండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ (77) ఇక లేరు.
వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్రతో హ్యాపీగా ఉన్న భారత్ క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్! భారత క్రికెట్ దిగ్గజం, టీం ఇండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ (77) ఇక లేరు. అనారోగ్యం కారణంతో ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. తన ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్ తో క్రికెట్ అభిమానులకు, భారత్ కు ఎన్నో చిరస్మరణీయ క్షణాలను అందించారు. స్పిన్ బౌలింగ్ రివల్యూషన్ రూపశిల్పులలో ఒకరిగా క్రికెట్ లో తనదైన ముద్ర వేశారు.
అవును... భారత్ తొలి వన్డే విజయంలో ఎరపల్లి ప్రసన్న, బీఎస్ చంద్రశేఖర్, ఎస్. వెంకటరాఘవన్ లతో కలసి కీలక పాత్ర పోషించిన లెజెండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూశారు. 1946, సెప్టెంబర్ 25న అమృత్ సర్ లో జన్మించిన ఆయన.. 1967లో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశారు. అనంతరం 1979లో తొలి టెస్టు ఆడాడు. ఈ క్రమంలో... కొద్దికాలంలోనే దిగ్గజ స్పిన్నర్ గా ఎదిగి టీమిండియాకు ప్రధాన బౌలర్ గా మారారు.
1975 ప్రపంచ కప్ లో భాగంగా ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో తన బెస్ట్ బౌలింగ్ రికార్డ్స్ (12-8-6-1)తో ఆ జట్టును 120 పరుగులకే కట్టడి చేశారు. భారత్ తరఫున 1966 నుంచి 1979 వరకు ఆడిన బిషన్ సింగ్ బేడీ... మొత్తంగా 67 టెస్టులు ఆడి 266 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక 10 వన్డేలు ఆడి 7 వికెట్లు తీసుకున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 370 మ్యాచ్ లు ఆడి ఏకంగా 1,560 వికెట్లు పడగొట్టారు.
1978-79 కాలంలో ఢిల్లీ జట్టును రెండు సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంలో బేడీ రాణింపు కారణమని అభిమానులు చర్చించుకుంటారు. ఫలితంగా... అప్పట్లో టీం ఇండియా నుంచి అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా ప్రసిద్ధిగాంచారు. ఇలా క్రికెట్ లో ఆయన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1970లోనే పద్మశ్రీ పురస్కారంతో ఆయనను సత్కరించింది.
అనంతర కాలంలో... 1990లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ పర్యటనల సమయంలో భారత క్రికెట్ జట్టుకు మేనేజర్ గా ఉన్న బిషన్ సింగ్ బేడీ... జాతీయ సెలెక్టర్ గానే కాకుండా మణిందర్ సింగ్, మురళీ కార్తిక్ వంటి అనేక ఎంతో ప్రతిభావంతులైన స్పిన్నర్లకు మెంటార్ గా కూడా ఉన్నారు. ఈ క్రమంలో 2004లో సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు బిషన్ సింగ్ బేడీ.
బిషన్ సింగ్ మృతి పట్ల పలువురు క్రికెటర్లు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు. ఇందులో భాగంగా... భారత మాజీ టెస్టు కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ మృతికి బీసీసీఐ సంతాపం తెలుపింది. ఈ కష్ట సమయాల్లో మా ఆలోచనలు, ప్రార్థనలు అతని కుటుంబం, అభిమానులతో ఉన్నాయని తెలిపింది. ఈ సందర్హంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంది. ఇదే సమయంలో... "మా అత్యుత్తమ వ్యక్తులలో ఒకరైన బిషన్ సింగ్ బేడీ ఇక లేరు. ఇది మన క్రికెట్ సోదరులకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశారు.