గిరిజన బీసీ బ్రాహ్మణ వైశ్య.. సీఎంల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం

హమ్మయ్య.. ఒక అంకం ముగిసింది.. ఢిల్లీ గద్దెపై బీజేపీ సీఎం 26 ఏళ్ల తర్వాత కొలువుదీరారు.. అది కూడా మహిళా సీఎం వచ్చారు. ఎవరూ ఊహించని విధంగా తొలిసారి ఎమ్మెల్యే అయిన రేఖా గుప్తాను పదవి వరించింది.

Update: 2025-02-20 19:30 GMT

హమ్మయ్య.. ఒక అంకం ముగిసింది.. ఢిల్లీ గద్దెపై బీజేపీ సీఎం 26 ఏళ్ల తర్వాత కొలువుదీరారు.. అది కూడా మహిళా సీఎం వచ్చారు. ఎవరూ ఊహించని విధంగా తొలిసారి ఎమ్మెల్యే అయిన రేఖా గుప్తాను పదవి వరించింది. అయితే, ఒక్క చెప్పుకోవాల్సింది సీఎం ఎంపికలో బీజేపీ వ్యవహరించిన విధానం గురించి. రెండేళ్లుగా ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో కాషాయ పార్టీ ఇదే విధంగా అనూహ్య నిర్ణయాలు తీసుకుంది.

వాస్తవానికి ఢిల్లీలో బీజేపీ ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు. కారణం.. మిగతా రాష్ట్రాలు వేరు.. ఢిల్లీ వేరు. మినీ ఇండియాగా పేరుగాంచిన రాజధానిలో సామాజిక సమతుల్యత అనేది పెద్ద అంశం కాదు. కానీ, బీజేపీ మాత్రం వేరే విధంగా ఆలోచించింది.

ఛత్తీస్ గఢ్ లో సీనియర్ నాయకులున్నప్పటికీ పక్కనపెట్టి విష్ణుదేవ్ సాయిని సీఎంని చేసినట్లే.. మధ్యప్రదేశ్ లో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను కాదని మోహన్ యాదవ్ ను పదవి అప్పగించినట్లే.. రాజస్థాన్ లో వసుంధరా రాజేనూ కాదని భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిగా ప్రకటించినట్లే.. ఢిల్లీలోనూ రేఖా గుప్తాను అందలం ఎక్కించింది.

ఇక్కడ గమనించాల్సింది ఏమంటే.. రేఖా గుప్తా బనియా (వైశ్య) సామాజికవర్గం వారు. భజన్ లాల్ శర్మ బ్రాహ్మణులు. విష్ణుదేవ్ సాయి గిరిజన వర్గానికి చెందినవారు. మోహన్ యాదవ్ ఓబీసీ యాదవులు. పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో మాత్రమే బ్రాహ్మణుడైన దేవేంద్ర ఫడణవీస్ ను ఆశ్చర్యం లేకుండా సీఎం చేసింది.

అన్ని వర్గాలకూ చోటు

ఢిల్లీలో రేఖా గుప్తాను సీఎం చేయడం ద్వారా బీజేపీ మహిళా సీఎం లేని లోటు తీరింది. హరియాణా గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. గత ఏడాది లోక్ సభ ఎన్నికల ముందు క్షత్రియుడైన ఖట్టర్ ను తప్పించి నాయబ్ సింగ్ సైనీని సీఎంగా కూర్చోబెట్టి ఓబీసీకి పట్టం కట్టింది. ఇవన్నీ చూస్తుంటే బీజేపీ అన్ని వర్గాలకూ ప్రాధాన్యం ఇచ్చినట్లు అయింది.

Tags:    

Similar News