బీజేపీ సెంటిమెంటును రాజేస్తోందా ?

అభ్యర్ధుల ఎంపికలో అమిత్ షా పర్యటన క్లారిటి ఇస్తుందని సీనియర్లు అనుకుంటున్నారు

Update: 2023-08-22 06:26 GMT

రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ సెంటిమెంటును రాజేస్తున్నట్లుంది. ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం నుండి పూరించేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. భద్రాద్రి రాముడి ఆశీర్వాదంతో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తే గెలుపు ఖాయమని ప్రచారం చేస్తోంది. భద్రాచలం నుండి ఎన్నికల సమరాన్ని ప్రారంభించటం అంటే హిందుత్వ అజెండాను నెత్తికెత్తుకోవటం అనటంలో సందేహంలేదు. అందుకు ఈనెల 27వ తేదీన ఖమ్మం వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోనే ఎన్నకల శంఖారావాన్ని పూరించేట్లుగా ప్లాన్ చేస్తున్నారు.

అభ్యర్ధుల ఎంపికలో అమిత్ షా పర్యటన క్లారిటి ఇస్తుందని సీనియర్లు అనుకుంటున్నారు. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీలను, సీనియర్ నేతలందరినీ కచ్చితంగా ఎంఎల్ఏలుగానే పోటాచేయాలని ఇప్పటికే నరేంద్రమోడీ చెప్పేశారు. దాని ప్రకారం చూస్తే ఓ 40 నియోజకవర్గాల్లో పార్టీ తరపున గట్టి అభ్యర్ధులు రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. మరి మిగిలిన 79 నియోజకవర్గాల్లో ఏమిచేస్తారనేది చూడాలి. పోటీచేయటానికి ఎవరో ఒకరు దొరకటం వేరు, ప్రత్యర్ధులకు ధీటుగా పోటీ ఇస్తారని అనిపించుకోవటం వేరు.

ఇలాంటి గట్టి నేతలు లేకే ఇతర పార్టీలకు బీజేపీ గాలమేస్తోంది. అయితే ఆ గేలానికి నేతలు ఎవరు తగలటంలేదు. ఈ నేపధ్యంలోనే ఈటల రాజేందర్ మాట్లాడుతు నెలాఖరులో బీజేపీలోకి 22 మంది కీలకమైన నేతలు చేరబోతున్నట్లు చెప్పారు. దాంతో అందరిలోను బీజేపీలో చేరబోయే ఆ 22 మంది నేతలు ఎవరనే ఆసక్తి పెరిగుతోంది.

ఇదే సమయంలో ఈటల ప్రకటనలో వాస్తవం ఉందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకటి మాత్రం నిజం ఏమిటంటే ప్రస్తుతం బీజేపీ పరిస్ధితి ఏమీ బాగాలేదు. పార్టీకి ఒకపుడు ఉన్నంత ఊపు ఇపుడు ఎక్కడా కనబడటంలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కల్వకుంట్ల కవిత పాత్ర కీలకమని ఈడీ ఎప్పుడో తేల్చేసింది. అయినా ఆమె అరెస్టు జరగకపోవటమే విచిత్రంగా ఉంది. ఇక్కడే బీఆర్ఎస్-బీజేపీ ఒకటే అనే ప్రచారాన్ని కాంగ్రెస్ మొదలుపెట్టింది. దాన్ని జనాలు నమ్ముతున్నారు. అందుకనే బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. మరి పడిపోయిన గ్రాఫ్ ను బీజేపీ ఎలా లేపుతుందో చూడాలి.

Tags:    

Similar News