మోడీ హవా.. మూడు రాష్ట్రాల్లో కమల వికాసం!
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఒకటి మినహా.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితా లు వచ్చేశాయి
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఒకటి మినహా.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితా లు వచ్చేశాయి. ఆయా రాష్ట్రాల్లో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి. వీటిలో తెలంగాణ ను పక్కన పెడితే.. మిగిలిన మూడు రాష్ట్రాల్లోనూ అనూహ్యంగా కమల వికాసం కనిపించింది. గతానికి భిన్నంగా పార్టీ పుంజుకుంది. భారీ మెజారిటీతో అభ్యర్థులు గెలుపు గుర్రం ఎక్కడంతోపాటు.. కనీవినీ ఎరుగని రీతిలో మేజిక్ ఫిగర్‌ను దాటేసింది.
మధ్యప్రదేశ్‌లో 137, రాజస్థాన్‌లో 117, ఛత్తీస్ గఢ్‌లో 47 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. ఇవన్నీ మేజిక్ ఫిగర్‌కు దాదాపు చాలా ఎక్కువ. దీంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైంది. అయితే.. ఒక్క మధ్యప్రదేశ్‌లో మాత్రమే బీజేపీ తన అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంది. మిగిలిన రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌లలో మాత్రం కాంగ్రెస్‌ను మట్టి కరిపించి.. తన సత్తా చాటుకుంది.
ఇక, బీజేపీ మూడు రాష్ట్రాల్లో గెలుపు గుండుగుత్తగా .. ప్రధాని నరేంద్ర మోడీ ఖాతాలోనే పడనుందని అంటున్నారు పరిశీలకులు. కర్తకర్మ క్రియ అన్నీ తానై, ఆయా రాష్ట్రాల్లో మోడీ ప్రచారం చేశారు. రాజస్థాన్‌లో అత్యధికంగా 18 సార్లు, ఛత్తీస్‌ఘడ్‌లో 8 సార్లు, మధ్యప్రదేశ్‌లో 10 సార్లు. మోడీ ప్రచారం చేశారు. మొత్తానికి ఈ పరిణామం బీజేపీకి కలిసి వచ్చింది. పైగా.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయానికి ముందు జరిగిన ఎన్నికలను సెమిఫైనల్‌గా భావిస్తున్నారు.
దీంతో మోడీ హవా మరింత పెరుగుతుందని.. ఆయన ఆదరణకు తిరుగులేదని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే.. బీజేపీ మూడు రాష్ట్రాల్లో గెలిచిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలకు నాయకులు పిలుపునిచ్చారు. ఏపీలోనూ.. బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకునేందుకు పురందేశ్వరి పిలుపునివ్వడం గమనార్హం. మొత్తానికి దీనిని బీజేపీగెలుపు అనేకంటే.. కూడా.. మోడీ హవానే అంటున్నారు పరిశీలకులు.