మోడీ సర్కారు దమ్ము ప్రకటన.. పీవోకే మనదే.. 24 సీట్లు రిజర్వ్

ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా యుద్దంలో గెలిచి మరీ.. తమ భూభాగాన్ని వివాదంలో పెట్టుకున్న దేశం మనదే అవుతుంది

Update: 2023-12-07 04:34 GMT

మిగిలిన విమర్శలు ఎన్ని ఉన్నా సరే.. మోడీషాలను దేశంలోని అత్యధికులు అభిమానించే విషయంలో ఒక అంశం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా యుద్దంలో గెలిచి మరీ.. తమ భూభాగాన్ని వివాదంలో పెట్టుకున్న దేశం మనదే అవుతుంది. దాయాది పాకిస్థాన్ మనతో యుద్ధానికి దిగటం.. ఆ సందర్భంగా కశ్మీర్ లోని కొంత భాగాన్నిఆక్రమించటం.. ఆ యుద్ధంలో భారత్ గెలుపొందినప్పటికీ.. పాక్ ఆక్రమించిన కశ్మీర్ ను మాత్రం పాక్ అక్రమిత కశ్మీర్ కింద మ్యాపుల్లో చూపించుకోవటం మినహా కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు.

ఈ విషయంలో మొదట్నించి బలమైన వాదనను వినిపిస్తోంది బీజేపీ. అందుకు తగ్గట్లే.. మోడీ సర్కారు ఏర్పడిన పదేళ్ల కాలంలో దీనికి సంబంధించిన కొన్నికీలక ప్రకటనలు వెలువడుతున్నాయి. తాజాగా వెలువడిన ప్రకటన ఈ కోవకు చెందిందే. పాక్ అక్రమిత కశ్మీర్ గురించి మాట్లాడటానికి సైతం కాంగ్రెస్ వెనుకా ముందు ఆడే పరిస్థితి. ఆ పేరును ఉచ్చరించటానికి కూడా సందేహించే పరిస్థితి. అందుకు భిన్నంగా పాక్ అక్రమిత కశ్మీర్ భారత్ దేనని.. అక్కడ 24 సీట్లను రిజర్వ్ చేసినట్లుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో వెల్లడించారు.

తాజాగా జమ్ముకశ్మీర్ లో రెండు కీలక బిల్లుల్ని ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆయన ఆసక్తికర ప్రకటన చేశారు ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 370 రద్దు చేసి.. అసెంబ్లీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు2023, జమ్మూకశ్మీర్ రీఅర్గనైజేషన్ (సవరణ) బిల్లు 2023 ను కేంద్రంలోని మోడీ సర్కారు లోక్ సభలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో పునర్విభజన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఎలా ఉంటుంది? రిజర్వేషన్లు అమలు ఎలా సాగుతుంది? లాంటి అంశాల్ని పేర్కొన్నారు.

ఈ అంశంపై రెండు రోజుల పాటు లోక్ సభలో చర్చించిన అనంతరం.. తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. తాము ప్రవేశ పెట్టిన రెండు బిల్లులకు సంబంధించి కీలక అంశాల్ని సభకు వెల్లడించారు. అందులో ముఖ్యమైనది అసెంబ్లీ స్థానాల సంఖ్య. గతంలో జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 93 ఉండగా. తాజాగా దాన్ని 90కు పెంచాలన్న ప్రతిపాదనను వెల్లడించారు. కశ్మీర్ డివిజన్ లో 46, జమ్ము డివిజన్ లో 37 స్థానాలు ఉండేవి.

తాజా బిల్లులో కశ్మీర్ డివిజన్ లో అసెంబ్లీ స్థానాల్ని 47.. జమ్ము డివిజన్ లో 43కు పెంచినట్లుగా అమిత్ షా వెల్లడించారు. పాక్ అక్రమిత కశ్మీర్ సైతం భారత్ లో భాగమేనన్న ఆయన.. అక్కడ కూడా 24 స్థానాల్ని రిజర్వ్ చేసినట్లుగా పేర్కొన్నారు. కశ్మీర్ లో రెండు స్థానాల్ని అక్కడకు వలస వెళ్లిన వారు.. ఒక స్థానాన్ని పాక్ అక్రమిత కశ్మీర్ నుంచి వచ్చి స్థిరపడిన వారికి రిజర్వు చేసిట్లుగా పేర్కొన్నారు. మొదటిసారి ఎస్సీ.. ఎస్టీ వర్గాలకు తొమ్మిది స్థానాల్ని కేటాయించిన విషయాన్ని వెల్లడించారు. చాలామంది కశ్మీరీలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నాయని.. ఈ బిల్లుతో వారికి హక్కులు.. ఉద్యోగాలు.విద్యావకాశాలు.. రిజర్వేషన్ల సాయంతో ఎన్నికల్లో నిలుచునే అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు.

ఆర్టికల్ 370 రద్దు తొలగింపు తర్వాత ఉగ్రవాదం కొనసాగుతుందన్న విమర్శతో అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన అమిత్ షా.. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర మరణాల్లో 70 శాతం.. భద్రతా సిబ్బంది మరణాల్లో 62 శాతం తగ్గాయన్నారు. ఆర్టికల్ 370 తొలగింపుతో ఉగ్రవాదం అంతం అవుతుందని తామెప్పుడూ చెప్పలేదని.. వేర్పాటువాదం అంతం అవుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు.

Tags:    

Similar News